వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. నాగర్ కర్నూలు తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ చెట్టుకు నాగరాజు(29), శ్రుతి(21) ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు. వీరిద్దరూ నాగర్ కర్నూలు మండలం తూడుకుర్తి వాసులని అంటున్నారు. వివాహితుడైన నాగరాజు కొంతకాలంగా శ్రుతితో సంబంధం కొనసాగిస్తున్నాడని, అతని భార్యకు విషయం తెలియడంతో ఘర్షణలు తలెత్తాయని సమాచారం. రోజురోజుకూ గొడవలు ముదురుతుండటంతో నాగరాజు, శ్రుతితో కలసి బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. నాగరాజుకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకును జాగ్రత్తగా చూసుకోవాలని నాగరాజు తన సూసైడ్ నోట్ లో తన తండ్రిని కోరాడు.
పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.