Sultan filed a case that his wife had married a second time
mictv telugu

HYD భార్య రెండో పెళ్లి.. ‘ఎ ’సర్టిఫికెట్‌తో మొదటి భర్త కేసు

August 12, 2022

చట్ట ప్రకారం విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్ళి చేసుకున్న భార్యపై మొదటి భర్త కేసు వేసిన ఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా తనను శారీరకంగా, మానసికంగా వేధించారని, దాడులకు కూడా పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసుల వద్ద భోరుమన్నాడు. లేనిపోని అభాండాలు వేస్తున్నారని, తన వద్ద డాక్టర్లిచ్చిన ‘ఎ’ సర్టిఫికెట్ కూడా ఉందంటూ ఆవేదన చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ అనే వ్యక్తి 2013లో రుబీనా బేగం అనే యువతిని పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నాడు.

కొన్నాళ్లకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2017లో భార్య సుల్తాన్ నుంచి వేరుపడి ముబీనుద్దీన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే ముస్లిం వివాహ చట్టాల ప్రకారం ఖులా (విడాకులు) ఇవ్వకుండానే రుబీనా రెండో పెళ్లి చేసుకుందని సుల్తాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాక, తన లైంగిక సామర్ధ్యంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తన వద్ద డాక్టర్లు పరీక్షించి ఇచ్చిన లైంగిక సామర్ధ్య సర్టిఫికెట్ కూడా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొని పోలీసులకు చూపించాడు. తన భార్య రుబీనా, ఆమె తల్లి నుంచి ప్రాణహాని ఉందని వేడుకోవడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.