కేటీఆర్‌పై సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు..  - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్‌పై సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు.. 

September 21, 2020

Sumedha's parents' complaint against KTR ..

నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్న ఓపెన్ నాలాకు మొన్న 12 ఏళ్ల సేమేథ కపూరియా బలైన విషయం తెలిసిందే. చేయెత్తు ఎదిగిన కుమార్తెను పోగొట్టుకున్న ఆ కన్నవాళ్ల బాధను ఎవరూ తీర్చలేనిది. ఈ నేపథ్యంలో సుమేథ తల్లిదండ్రులు సోమవారం నేరెడ్‌మెట్ పోలీసులను ఆశ్రయించారు. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జోనల్‌ కమిషనర్‌, స్థానిక కార్పొరేటర్‌, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

వీరందరిపై ఐపీసీ సెక్షన్‌ 304 ప్రకారం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలావుండగా మొన్న ఈ ఘటనపై న్యాయవాది మామిడి వేణు మాధవ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. నగరంలో తెరిచి ఉన్న నాలాలు పిల్లల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వాటిలో చిన్నారులు పడి ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా నగరంలో ఓపెన్ నాలలపై కప్పులు వేసి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి వెంటనే రూ.కోటి నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించాలని న్యాయవాది కోరారు. కాగా, నేరేడ్‌మెట్‌లోని కాకతీయ నగర్‌లో నివాసం ఉండే అభిజిత్‌, సుకన్య దంపతుల కుమార్తె సుమేథ గత గురువారం సాయంత్రం సైకిల్‌ తొక్కుకుంటూ బయటికెళ్లింది. దీన్‌దయాళ్‌ నగర్‌లోని ఓపెన్‌ నాలాలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందింది. వరద ఉధృతికి బాలిక మృతదేహం కొట్టుకుపోయి బండచెరువులో తేలింది. ఈ ఘటనపై వివిధ ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.