వేసవి కాలం మొదలైంది. ఇప్పటికే ఎండలు ముదిరిపోయాయి. ఉదయం పదకొండు దాటిందంటే సూర్యుడు సుర్రుమంటున్నాడు. అన్నికాలాల్లో కంటే ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బలు లాంటివి తగిలాయి అంటే అంతే సంగతులు. అసలే ఇప్పడు హార్ట్ స్ట్రోక్ ల కాలం నడుస్తోంది. వేసవి కాలం హాయిగా సాగాలంటే కొంత జాగ్రత్తగా ఉండాలి.
తలనొప్పి, తల తిరగడం, మెదడు బ్లాంక్‌గా మారి ఏమీ తెలియకపోవడం, ఆకలి లేకపోవడం,అనారోగ్యంగా అనిపించడం, ఫలానా సమస్య అని స్పష్టంగా తెలియకపోవడం, అలసట ఉంటే వడదెబ్బ తగిలినట్టే. చేతులు, కాళ్ళు, కడుపు కండరాల నొప్పులు, పట్టేసినట్లు ఉండడం ,ఊపిరి తీసుకోవడంలో వేగం పెరగడం , పిల్లలైతే ఊరికే పడుకోవడానికి ఇష్టపడుతుంటారు. సాధారణంగా కంటే ఎక్కువ సమయం నిద్రపోతుంటారు. లేచిన తర్వాత కూడా హుషారుగా ఉండలేకపోతారు. ఈ లక్షణాలు కనిపిస్తే సన్‌స్ట్రోక్ నుంచి బయటపడ్డానికి చికిత్స తీసుకోవాల్సిందే.
వెంటనే చేయాల్సిన పనులు:
ఎండ నుంచి వెంటనే చల్లటి ప్రదేశంలోకి మారాలి. పడుకుని పాదాలను కొంచెం ఎత్తులో ఉంచాలి.డీ హైడ్రేషన్‌కు గురయిన శరీరం తిరిగి హైడ్రేషన్ పొందడానికి ద్రవపదార్ధాలు తీసుకోవాలి. గ్లూకోజ్ లాంటివి తీసుకుంటే మంచిది. తడి టవల్‌తో బాడీని, పాదాలను, అరచేతులను, ముఖాన్ని, మెడను తరచుగా తుడవాలి. ∙గాలి ధారాళంగా తగిలేటట్లు, హాయిగాఊపిరి పీల్చుకోగలిగిన స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే అరగంట సేపటికి వడదెబ్బ నుంచి దేహం సాంత్వన పొందుతుంది. తీవ్రంగా వడదెబ్బ బారిన పడినప్పుడు నీళ్ళు, ఇతర రీ హైడ్రేషన్ ద్రవాలు ఏవి తాగినా వాంతి అవుతుంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుని పర్యవేక్షణలో సెలైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది.