మజ్జిగ ప్యాకెట్లు కొంటున్నారా? ఇవి  గమనిస్తున్నారా? - MicTv.in - Telugu News
mictv telugu

మజ్జిగ ప్యాకెట్లు కొంటున్నారా? ఇవి  గమనిస్తున్నారా?

March 21, 2019

వేసవికాలం మొదలైంది. ఎండలు ఉడికిస్తున్నాయి. ఇంట్లోంచి, ఆఫీసుల్లోంచి బయటకు వెళ్లబుద్ధి కాదు.ఫ్రిజ్ నీళ్లు, జ్యూసులు, చెరుకు రసాలు, కూల్ డ్రింకులు, నిమ్మకాయ రసం, మజ్జిగ తాగాలని తెగ ఉబలాటపడిపోతుంటారు. కానీ వీటి విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశముంది.

దాహార్తని తీర్చడంలో ముందుండే మజ్జిగ గురించి తెలుసుకుందాం. ఈ వేసవిలో మజ్జిగ ప్యాకెట్లు ఎక్కడపడితే అక్కడ అమ్ముడు పోతుంటాయి. ఇలాంటి మజ్జిగ అనారోగ్యాన్నిచ్చే కూల్‌ డ్రింకుల కన్నా లక్ష రెట్లు మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్‌ అందుతాయని అంటున్నారు. సీజనల్‌గా వచ్చే చిన్నచిన్న జబ్బులు రాకుండా మజ్జిగ కాపాడుతుందట.

Summer heat Beware of buying cold buttermilk packets

జాగ్రత్తలు

ఇన్ని ఉపయోగాలు వున్న మజ్జిగను కొందరు వ్యాపార దురుద్దేశంతో దానిని కల్తీ చేస్తున్నారు. కాబట్టి మజ్జిగను కొనేటప్పుడు ప్యాకెట్‌పై డేట్ చూసి తీసుకుంటే మంచిది. ఔట్ డేటెడ్ మజ్జిగ ప్యాకెట్లు కూడా యథేచ్ఛగా మార్కెట్లో అమ్ముతున్నారు. ఇలాంటివి తాగడంవల్ల ఆరోగ్యం పాడవుతుంది. మంచి పేరున్న బ్రాండ్ కంపెనీల మజ్జిగను తీసుకోవడం మంచిది. ప్లాస్లిక్ కవర్లలో మజ్జిగను ప్యాక్ చేసి అమ్ముతుంటారు. ఇలాంటి మజ్జిగ వల్ల ఆరోగ్య నష్టాలు వున్నాయి అంటున్నారు వైద్యులు.

మజ్జిగలో నీళ్లతో పాటు తైల బిందువులు, అమైలోజ్‌, లాక్టోజ్‌ వంటి పిండి పదార్థాలు, లవణాలు, కొంత ఆల్కహాలు, బ్రతికే ఉన్న ఈస్ట్‌ బాక్టీరియా వంటివి విరివిగా ఉంటాయి. అయితే ప్లాస్టిక్‌ సంచుల్ని కడగకుండానే పాల కేంద్రాల్లో లేదా దుకాణాల్లో మజ్జిగను, పాలను నింపుతారు. ఆ సమయంలో పాలు, మజ్జిగ వంటి పదార్థాల్లో ఉన్న సేంద్రియ లక్షణం ఉన్న పదార్థాలకు, ప్లాస్టిక్‌ సంచుల్లో మిగిలిపోయిన సేంద్రియ మలినాలకు మధ్య రసాయనిక చర్య జరిగి అనారోగ్యకారకాల్ని ఏర్పర్చవచ్చు. కాబట్టి ఇలాంటివి ఆచితూచి చూసుకుని కొనుక్కోవాలి. ఎండ వేడిమి నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి దొరికింది తాగేద్దామనుకుంటే కుదరదు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా వుండాలి. ప్యాకెట్ల మీద డేట్లు, బ్రాండింగ్ చూసి కొనుక్కోవాలి. అప్పుడే మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.

మజ్జిగ ఉపయోగాలు..

 

కడుపులో వికారం, వాంతులు సమస్యతో బాధపడేవాళ్లు మజ్జిగలో కొద్దిగా జాజికాయపొడి వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.

 

వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది.

 

ఎక్కిళ్లను ఆపడానికి మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది. అర కప్పు మజ్జిగలో పావు స్పూన్‌ శొంఠి పొడి కలిపి తాగితే.. వెంటనే ఉపశమనం కలుగుతుంది.

 

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు రోజుకు మూడు, నాలుగు సార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వేయించిన జీలకర్ర కలిపి తాగితే వడదెబ్బ తగలదు.

 

కాళ్ల పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుంది.

 

 – మజ్జిగలో ఉండే విటమిన్‌ బి12, పోటాషియం, ఫాస్ఫరస్‌, క్యాల్షియం ఊబకాయ     నివారణకు ఇవి ఉపయోగపడుతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా మజ్జిగ తాగితే బరువు తగ్గుతారు.

  

– ప్రతి రోజు మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

 

–  మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి.