తెలంగాణ స్కూలు పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 24 (రేపటి) నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఎండలు ముదిరిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మళ్లీ జూన్ 13వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని తెలిపింది. ఈ వేసవి సెలవులు 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఉంటాయని, మే 23 నుంచి 28వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగుతాయని సూచించింది.
మరోపక్క రేపటి నుండి 10వ తరగతి విద్యార్థులకు రివిజన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రతి రోజు ఒక ఉపాధ్యాయుడు హాజరై, పదవ తరగతి విద్యార్థులకు రివిజన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. ఇక, రేపటి నుంచి ప్రైవేటు పాఠశాలలు తెరిస్తే, కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ హెచ్చరించింది. కాగా, మే 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉండగా, మే 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.