ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయగా.. మల్లు రవిని ఏ5 నిందితుడిగా చేర్చారు. ఇదివరకే మల్లు రవికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఇవాళ సీసీఎస్ విచారణకు హాజరైన మల్లు రవి.. నిర్దేశించిన తేదీలోనే రావాలని సైబర్ క్రైం పోలీసులు వెనక్కి పంపించారు. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ గళం పేరిట వీడియోలు పోస్టు చేశారన్న ఆరోపణలపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక తనిఖీ చేపట్టిన సంగతి తెలిసిందే. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ సీజ్ చేశారు. అయితే.. తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను మల్లు రవి, షబ్బీర్ అలీతోపాటు కొంతమంది నేతలు అడ్డుకున్నారు కూడా. ఇక సునీల్ కనుగోలు కింద పనిచేస్తున్న మెండా శ్రీ ప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో సీఆర్పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేశారు. ఈనెల 12వ తేదీన(గురువారం) విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆయన ఈ రోజే విచారణకు హాజరు కాగా.. రేపు రావాలని చెప్పారు.