న్యూస్ చానల్స్: భయం భయంగా ఎన్నాళ్లిలా? - MicTv.in - Telugu News
mictv telugu

న్యూస్ చానల్స్: భయం భయంగా ఎన్నాళ్లిలా?

August 31, 2017

సన్ నెట్ వర్క్ లోని తెలుగు చానల్ జెమిని న్యూస్, కన్నడ చానల్ ఉదయ న్యూస్ అక్టోబర్ 24 నుంచి మూసివేస్తున్నట్టు ఆ యాజమాన్యం చేసిన ప్రకటన ఆ రెండు చానల్స్ సిబ్బందితోబాటు మొత్తం మీడియా పరిశ్రమనే దిగ్భ్రాంతికి గురిచేసింది. 33 చానల్స్ నడుపుతున్న నెట్ వర్క్ సైతం హఠాత్తుగా ఇలా రెండు న్యూస్ చానల్స్ మూసి వేయాలనుకోవటం, కనీస సంకేతాలు కూడా లేకుండా ఉన్నట్టుండి ప్రకటించటం సహజంగానే ఒక అయోమయ వాతావరణాన్ని సృష్టించింది. ఇంకా ఎన్ని యాజమాన్యాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనన్న భయాలూ మొదలయ్యాయి. ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించాలంటే ముందుగా సన్ నెట్ వర్క్ నిర్ణయాన్ని విశ్లేషించటంతోబాటు ఇలాంటి పరిస్థితులకు కారణాలనూ పరిశీలించాల్సి ఉంది.

ఒకప్పుడు తమిళనాట సన్ టీవీ వార్తలకు తిరుగులేని స్థానం ఉండేది. అన్నా డిఎంకె వారు సైతం వార్తల విషయంలో సన్ టీవీ మీద అంతగా ఆధారపడేవారు. అయితే, న్యూస్ చానల్ గా మార్చినప్పుడు మాత్రం సన్ టీవీ కి నిరాశే ఎదురైంది. అప్పట్లో స్టార్ న్యూస్ లో ఇంగ్లిష్, హిందీ బులిటెన్లు మార్చి మార్చి ప్రసారమైనట్టుగా తమిళ, ఇంగ్లీషు బులిటెన్స్ ప్రసారం చేస్తూ సన్ న్యూస్ చానల్ నడిపింది. ఇదే ప్రయోగాన్ని కన్నడలోనూ సాగించింది. ఒకే ఇంగ్లిష్ బులిటెన్ రెండు చానల్స్ లోనూ వాడుకుంటూ తమిళ, కన్నడ న్యూస్ చానల్స్ నడిచాయి. అయితే, వాటికి ఎలాంటి పోటీ లేని రోజుల్లో కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

అయినప్పటికీ, అన్యమనస్కంగానే కన్నడ న్యూస్ చానల్ కొనసాగిస్తూ ఇంగ్లిష్ బులిటెన్ తొలగించారు. అదే విధంగా తెలుగులోనూ న్యూస్ చానల్ ప్రారంభించారు. అప్పటికే తెలుగులో ఈటీవీ2, టీవీ9 ప్రారంభమై ప్రేక్షకాదరణ పొందుతూ ఉన్నాయి. వాటికంటే 8 నెలలు ఆలస్యంగా, ఎన్నికలు ముగిశాక 2004 సెప్టెంబర్ 5న జెమిని న్యూస్ మొదలైంది. ఇంకో మూడేళ్ళదాకా కొత్త చానల్స్ రాకపోయినా, జెమినీ న్యూస్ పెద్దగా పుంజుకోలేదు. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఎంత, సిబ్బంది అలసత్వం ఎంత, ఏది ఎక్కువ పాలు అనే చర్చ అనవసరం. రెండూ పరస్పరం ముడిపడి ఉన్న అంశాలు.

ఈ పదమూడేళ్ళ కాలంలో ఏదీ మారలేదు. యాజమాన్యం మార్కెట్ ను విశ్లేషించి వనరులు కల్పించటంలోగాని, తగినంతమంది సిబ్బందిని ఇవ్వటంలోగాని చొరవ చూపలేదు. కొత్త చానల్స్ వస్తున్న కొద్దీ అవి ముందుకు దూసుకుపోతూ వచ్చాయి తప్ప జెమిని న్యూస్ పరిస్థితిలో మార్పు కానరాలేదు. మార్పు వచ్చేందుకు యాజమాన్యం ఏనాడూ ప్రయత్నించలేదు. యాజమాన్యం… అంటే చెన్నై యాజమాన్యమా, హైదరాబాద్ యాజమాన్యమా అనే ప్రశ్నకు అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రమే సరైన సమాధానం చెప్పగలరు. అందువలన ఇప్పుడు ఎవరిని నిందించాలో వాళ్ళకు బాగా తెలుసు.

ఉదయ న్యూస్ విషయానికొస్తే అక్కడ చాలాకాలంపాటు గుత్తాధిపత్యం సాగింది. అందువలన ప్రేక్షకులు చానల్ చూడటానికి అలవాటు పడ్డారు. మధ్యలో కస్తూరి, సుప్రభాత అనే రెండు చానల్స్ వచ్చినా తట్టుకోలేకపోయాయి. కానీ దాదాపు మూడేళ్ళ తరువాత వచ్చిన సువర్ణ, టీవీ9 కన్నడ మాత్రం ఉదయ న్యూస్ ను బాగా వెనుకబడేట్టు చేశాయి. అయినప్పటికీ  ఆ తరువాత కూడా పదేళ్ళుగా చానల్ కొనసాగుతూనే వచ్చింది. మౌలిక సదుపాయాలు, జీతాల విషయంలో మాత్రం జెమిని న్యూస్ కూ, ఉదయ న్యూస్ కూ ఎలాంటి తేడా లేదు.

ఇప్పుడే ఎందుకు ?

ఇన్నేళ్ళుగా రేటింగ్స్ విషయంలో అదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి కారణమేంటి ? ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. నష్టాల గురించి ఇప్పుడే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? నిజానికి ఏదాదికేడాది సన్ గ్రూప్ లాభాలు పెరుగుతూ ఉండగా ఈ రెండు చానల్స్ నష్టాల్లో ఉన్నాయని మొదటి సారిగా ఇప్పుడే ఎందుకు చెబుతున్నారు? నష్టాలు వస్తున్న మాట నిజమా? వీటికి సమాధానాలనే మూసివేత నిర్ణయానికి సాకులుగా చూపుతున్నారు కాబట్టి  వాటి గురించి చెప్పుకోవటం చాలా ముఖ్యం.

చానల్స్ కు ఆదాయ వనరులు ప్రధానంగా ప్రకటనలు. అయితే, పే చానల్స్ అయినప్పుడు ప్రేక్షకులు చెల్లించే చందా కూడా ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. ఇటీవలి కాలం వరకూ ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు చందాలూ, ప్రకటనలూ దాదాపుగా చెరిసగం ఆదాయం తెచ్చిపెడుతూ ఉన్నాయి. స్థూలంగా చెప్పుకోవాలంటే ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ పే చానల్స్. ఒకటీ అరా మినహాయింపులు వదిలేద్దాం. అదే విధంగా న్యూస్ చానల్స్ అన్నీ ఉచిత చానల్స్. ఇక్కడ కూడా మినహాయింపులున్నాయి. ఎంటర్టైన్మెంట్ తోబాటు న్యూస్ చానల్స్ నడిపే ఈటీవీ, జెమినీ టీవీ తమ న్యూస్ చానల్స్ ను కూడా పే చానల్స్ గా ప్రకటించి వాటికీ చందాలు వసూలు చేస్తూ వచ్చాయి. జెమిని గ్రూప్ చానల్స్ అన్నిటికీ కలిపి మనం కట్టే చందాలో కొద్దిపాటి వాటా జెమిని న్యూస్ కు, ఈటీవీ న్యూస్ కూ చెందుతుంది.

ఈ విధంగా జెమిని న్యూస్ లేదా ఉదయ న్యూస్ ఇంతకాలంగా సగటున  నెలకు కోటి రూపాయలకు తగ్గకుండా ఆదాయం తెచ్చిపెడుతూనే ఉన్నాయి. ఖర్చు అంతకు మించే అవకాశం లేదు. అక్కడ సిబ్బంది సంఖ్య ( జెమిని 63, ఉదయ 73 అని లేబర్ కమిషన్ కిచ్చిన నోటీసులో సన్ నెట్ వర్క్ స్వయంగా చెప్పింది), వాళ్ళ జీతాలు తెలిసినవాళ్ళెవరైనా సులభంగా లెక్కగట్టగలరు.

డిజిటైజేషన్ తో ఆదాయానికి గండి!

కానీ ఇప్పుడు డిజిటైజేషన్ రూపంలో చిక్కొచ్చి పడింది. ఇప్పటివరకూ రేటింగ్స్ లేకపోయినా చానల్ అంటగట్టి ప్రేక్షకులనుంచి జెమినీ న్యూస్ కి, ఉదయ న్యూస్ కి చందాలు వసూలు చేసుకునే అవకాశం పోయింది. జెమినీ పేరు చెప్పి న్యూస్ అమ్ముకునే వీల్లేదు. డిజిటైజేషన్ జరిగిన క్రమంలో ప్రేక్షకుడు తాను ఎంచుకున్న చానల్ కి మాత్రమే డబ్బు చెల్లించే అవకాశం ఏర్పడింది. పాకేజ్ లను తిరస్కరించటానికి స్వేచ్ఛ ఉంది. అత్యధిక రేటింగ్స్ ఉన్న న్యూస్ చానల్స్ ఉచితంగా అందుతున్నప్పుడు జెమిని న్యూస్. ఉదయ న్యూస్ లాంటి చానల్స్ ను  చందా కట్టి మరీ చూసే అవకాశం లేదని సన్ నెట్ వర్క్ యాజమాన్యం గుర్తించింది. అందుకే లాభసాటి కాదంటూ ఈ  చానల్స్ ను వదులుకోవటానికి సిద్ధపడింది.

నిజానికి నష్టాల్లో ఉండటం వల్లనే చానల్స్ మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు లేబర్ కమిషనర్ కు ఇచ్చినలేఖతో జతపరచిన స్టేట్ మెంట్ అర్థరహితం. పదేళ్ళకు పైగా నష్టాలు భరించేంత సహనం ఉన్నట్టు సన్ నెట్ వర్క్ చెప్పుకోవటం కేవలం మోసం చేయటమే. నష్టాలున్నాయని తెలిసినప్పుడు ఏడాది మించి గతంలో ఏ చానల్ నైనా భరించారేమో చెప్పమనండి. నష్టాలు వస్తాయని తెలిసి మలయాళంలో న్యూస్ చానల్ ప్రారంభించని మాట నిజం. తమిళంలో సన్ న్యూస్  ఏడో స్థానానికి పడిపోయినా కొనసాగించటం రాజకీయ ప్రయోజనాలకోసమే తప్ప లాభాల్లో ఉన్నదని కాదు. ఒకప్పుడు నెంబర్ వన్ గా ఉన్న సన్ న్యూస్ ఇప్పుడు పాలిమర్, పుదియ తలైమురై, తంతి టీవీ, న్యూస్7, టీవీ18, జయ న్యూస్ తరువాత ఏడో స్థానంలో ఉంది. రోజూ దగ్గరే ఉండి చూసుకునే చానల్ ఎందుకు వెనుకబడిందో ఆలోచించరు, అక్కడి నష్టాలు పట్టించుకోరు.

లైసెన్స్ నిబంధనల్లో లొసుగులు

చానల్స్ మూసివేత సన్ నెట్ వర్క్ తీసుకున్న నిర్ణయం కాబట్టి పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకుముందు కూడా చానల్స్ మూతబడ్డాయి. ఇకముందు కూడా మూతపడవన్న గ్యారెంటీ లేదు. సన్ నెట్ వర్క్ నిర్ణయం తరువాత ఇలా ఆలోచించే యాజమాన్యాలు పెరుగుతాయేమోనన్న భయం పెరిగింది. అందుకే మీడియాలో ఎద్ద ఎత్తున కలవరం మొదలైందిప్పుడు. ఇబ్బడిముబ్బడిగా చానల్స్ పుట్టుకొస్తూ ఉన్నప్పుడు మరికొంతమందికి ఉపాధి దొరుకుతుందని సంతోషించినవాళ్ళే ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. చానల్ పెట్టినవాళ్ళు మూసేస్తారని ఊహించకపోవటం వల్లనే ఈ ఆవేదన.

ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. న్యూస్ చానల్ పెట్టాలనుకునే సంస్థల నెట్ వర్త్ ( అప్పులు పోను ఆస్తులు) కనీసం 100 కోట్లు ఉండాలన్నది ఆ సిఫార్సు సారాంశం. అయితే, ఒక్కసారిగా మూడు కోట్ల నుంచి వంద కోట్లు చేయటం బాగుండదని ప్రభుత్వం 20 కోట్లకు తగ్గించింది.  ఈ విధంగా చేయటం వలన ఆషామాషీగా న్యూస్ చానల్స్ పెట్టేవాళ్ళను అడ్డుకోవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం.

కానీ ఇక్కడ రెండు ప్రధానమైన లోపాలున్నాయి. ఇప్పటికే లైసెన్స్ తీసుకున్న చానల్స్ ను కొనుక్కుంటే ఆ 20 కోట్ల నిబంధన వర్తించదు. ఉదాహరణకు తెలుగులో ఎక్స్ ప్రెస్ టీవీ, 99% టీవీ అలా లైసెన్స్ కొనుక్కున్నవే. అదే విధంగా లీజుకు తీసుకొని చానల్స్ నడుపుకోవటానికి కూడా అవకాశముంది. ఇప్పుడున్న భారత్ టీవీ ( ఆంధ్రప్రభ వారి యువర్ న్యూస్), నెంబర్ 1 న్యూస్ ( వార్త వారి చానల్) అలా లీజుకు తీసుకుని నడుపుతున్నవే. అందువలన ప్రభుత్వం అనుకున్న విధంగా భారీ పెట్టుబడులు పెట్టగలిగినవారే న్యూస్ చానల్స్ పెట్టేలా చేయటం ఆచరణలో కుదరదని తేలిపోయింది.

ఇక రెండో ప్రధాన లోపమేంటంటే, నెట్ వర్త్ ఉండటానికీ, జీతాలు ఎగ్గొట్టి మూసివేయటానికీ ఎలాంటి సంబంధమూ లేదు. చానల్ యజమాని దగ్గర ఆస్తులున్నంత మాత్రాన జీతాలు సక్రమంగా ఇస్తాడనే గ్యారెంటీ ఏమీలేదు. చాలా చానల్స్ లో ఈ పరిస్థితి కనబడుతూనే ఉంది. నష్టాలు వస్తున్నాయని చెబుతూ వస్తున్నారే తప్ప ఆస్తులున్నాయి కదా ఆ నష్టాలు భరిస్తూ నెల నెలా క్రమం తప్పకుండా జీతాలిస్తున్నవాళ్ళు చాలా తక్కువ.

కొంతలో కొంతయినా దీనికి పరిష్కారం ఒక్కటే. న్యూస్ చానల్స్ తమ లైసెన్స్ కోసం దరఖాస్తుతో బాటు ఇచ్చే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో చూపిన లెక్కలను క్షుణ్ణంగా చూడటం, అందులో చెప్పిన జీతాలు ఏడాదిపాటు లెక్కించి ఆ మొత్తాన్ని ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేయించటం. దీనివలన ఆ చానల్ మూతబడే పరిస్థితిలో ఉద్యోగులకు కనీసం ఏదాది జీతం పరిహారంగా అందుతుంది. న్యూస్ చానల్స్ లో నెల జీతం సగటున 50 లక్షలకు మించదు కాబట్టి   ఏదాది జీతం అంటే ఆరు కోట్లు మాత్రమే. 20 కోట్ల నెట్ వర్త్ అడగటం కంటే ఈ నిబంధన కాస్త ఉపయోగకరంగా ఉంటుంది.

ఏ నిబంధనా వర్తించకుండా ఎడాపెడా చానల్స్ పెట్టుకోవటానికి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అవకాశం కల్పిస్తుండటం వల్లనే న్యూస్ చానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రూపొందించిన నిబంధనలేవీ సక్రమంగా లేకపోవటం, ఉన్నా వాటిని అమలు చేయలేకపోవటం దురదృష్టకరం. ఒక లైసెన్స్ లేని న్యూస్ చానల్ దాదాపు రెండేళ్ళపాటు నడిచినా పట్టించుకోని గుడ్డి అధికారులున్నంతకాలం యధేచ్ఛగా కొత్త చానల్స్ వస్తూనే ఉంటాయి. న్యూస్ లైసెన్స్ తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ కూడా నడుపుకోవచ్చు అన్న నిబంధన ఉండటం వలన అసలు దేశంలో ఎన్ని న్యూస్ చానల్స్ ఉన్నాయో ప్రభుత్వానికే లెక్క తెలియదు. జెమినీ మ్యూజిక్ ప్రభుత్వం లెక్కలో న్యూస్ చానల్.  ఇప్పుడు మూతపడబోతున్న  జెమిని న్యూస్, ఉదయ న్యూస్ చానల్స్ లైసెన్సులనూ సన్ యాజమాన్యం ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు వాడుకుంటే ఆశ్చర్యపడనక్కర్లేదు.

తోట భావనారాయణ

జర్నలిస్ట్