భారత్‌, గూగుల్ బంధం.. ఏకంగా 75 వేల కోట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌, గూగుల్ బంధం.. ఏకంగా 75 వేల కోట్లు 

July 13, 2020

Sundar Pichai announces Rs 75k crore Google for India Digitization Fund

భారత్‌తో సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇందుకోసం భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. రాబోయే 5 నుంచి 7 ఏళ్లల్లో భారత్‌లో 75,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని గూగుల్‌ సోమవారం ప్రకటించింది. గూగుల్‌ ఫర్‌ ఇండియా వర్చువల్‌ ఈవెంట్‌లో గూగుల్‌, అల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ..  గూగుల్‌ వెచ్చించే భారత డిజిటలీకరణ నిధిని తాను సగర్వంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. ఈ మొత్తాన్ని ఈక్విటీ భాగస్వామ్యాలు, పెట్టుబడులు, నిర్వహణ వంటి వివిధ రూపాల్లో సమకూరుస్తామని చెప్పారు. ‘భారత్‌ భవితవ్యం, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపై మాకున్న నమ్మకానికి ఈ భారీ పెట్టుబడులే నిదర్శనం. భారత డిజిటలీకరణలో కీలకమైన నాలుగు రంగాల్లో ఈ పెట్టుబడులు దృష్టి సారిస్తాయి. ప్రతి భారతీయుడకి తన సొంత భాషలో సమాచారాన్ని చేరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. భారత్‌ అవసరాలకు అనువైన ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం గూగుల్ ప్రధాన ఎజెండా. పరిశ్రమలు డిజిటల్‌ బాట పట్టేలా సహకరించడం, సామాజిక ప్రయోజనాలకు వైద్య, విద్యం, సేద్యం వంటి రంగాల్లో ఆటోమేషన్‌ ఇంటెలిజెన్స్‌ అమలు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను వెచ్చిస్తాం’ అని సుందర్ పిచాయ్ వెల్లడించారు. 

డిజిటల్‌ ఇండియా విజన్‌ను ప్రశంసిస్తూ ఆన్‌లైన్‌ వేదికలో భారత్‌ గొప్ప పురోగతి సాధించిందని.. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఈ కార్యక్రమం సఫలం అయిందని కొనియాడారు. డిజిటల్‌ కనెక్టివిటీకి లోతైన పునాదులు నిర్మించడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.  దీంతో స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకే అందుబాటులోకి రావడం, డేటా ధరలు తగ్గడం వంటి అంతర్జాతీయ స్ధాయి మౌలిక వసతులతో నూతన అవకాశాలకు అవకాశం ఏర్పడిందని అన్నారు. కాగా, గతవారం గూగుల్, అమెజాన్‌లకు కేంద్రం భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఆయా కంపెనీలను నిబంధనలు పాటించమంటూ.. తమ వద్ద ఉన్న వినియోగదారుల డేటాను 72 గంటలలోపు సమర్పించాలని కేంద్రం డెడ్‌లైన్‌ను విధించింది. గత రెండేళ్లుగా ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాపై కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈలోపే గూగుల్ భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశలో అడుగులు వేసింది.