గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ప్రమోషన్..! - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ప్రమోషన్..!

December 4, 2019

Sundar Pichai 01

భారతదేశానికి చెందిన టెక్ దిగ్గజం, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌‌కి ప్రమోషన్ వచ్చింది. గూగుల్‌ వ్యవస్ధాపకులు లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌ నుంచి తప్పుకోవడంతో ఆ కంపెనీ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌ వ్యవహరించనున్నారు. 21 సంవత్సరాల క్రితం గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను స్ధాపించిన పేజ్‌, బ్రిన్‌లు కంపెనీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వారు బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు. వెబ్‌ సెర్చింగ్‌, ఇతర టాస్క్‌లను వేగవంతం చేసేందుకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిపై జరుగుతున్న కసరత్తును ఇక సుందర్‌ పిచాయ్‌ మున్ముందుకు తీసుకువెళ్లనున్నారు. తాజా బాధ్యతల పట్ల సుందర్ హర్షం వ్యక్తం చేశారు.

సుందర్ పిచాయ్ 1972 జూన్ 10న తమిళనాడులోని మదురైలో జన్మించారు. ఖరగ్‌పూర్ ఐఐటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, వార్టన్ బిజినెస్ స్కూల్‌లో చదివారు. గూగుల్‌ సంస్థలో చేరకముందు మెక్‌కిన్సీ అండ్ కోలో సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేశారు. 2004 ఏప్రిల్ 1న మొదటిసారి గూగుల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తయారుచేయడంలో సుందర్ పిచాయ్‌దే కీలకపాత్ర. ఆ తర్వాత ఆండ్రాయిడ్ బిజినెస్‌ సుందర్ పిచాయ్ చేతుల్లోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్‌ మార్కెట్ విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సుందర్ పిచాయ్ ఆండ్రాయిడ్‌ బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న 100 కోట్ల డివైజ్‌లు అమ్ముడుపోవడం విశేషం. ఆ తర్వాత గూగుల్ ఇంటర్నెట్ బిజినెసెస్‌లో ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ ఇంఛార్జ్‌గా పనిచేశారు. 2015 నవంబర్‌లో గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సంస్థ సీఈఓ బాధ్యతలు చేపట్టారు.