Supari gang dumped Ragya's dead body in Krishna river
mictv telugu

నల్గొండ : అక్క మొగుడితో ఎఫైర్.. 20 లక్షలు సుపారీతో చంపేసింది

September 5, 2022

అక్క భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇల్లాలు.. అడ్డుగా ఉన్న భర్తను చంపించేందుకు భారీ ప్లాన్ వేసింది. రూ. 20 లక్షలు సుపారీ ఇచ్చి చంపేసిన తర్వాత మిస్సింగ్ అంటూ కేసు పెట్టింది. అనుమానం వచ్చిన పోలీసులు కాల్ డేటా చెక్ చేయడంతో అన్నీ బయటపడ్డాయి. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ తుంగపాడుకు చెందిన ధనావత్ రాగ్య (30) 12 ఏళ్ళ క్రితం పెద్దవూర మండలం ఊరబావికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి డ్రైవరుగా పని చేసుకుంటున్నాడు. అయితే రాగ్య భార్య రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన సబావట్ లక్పతితో గుట్టుగా వివాహేతర సంబంధం కొనిసాగిస్తోంది.

ఈ క్రమంలో అడ్డుగా ఉన్న భర్త రాగ్యను అడ్డుతొలగించుకోవాలని భావించి నేరెడు గొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన మాన్ సింగ్, బాలాజీలకు రూ. 20 లక్షల సుపారీ ఇచ్చింది. ప్లాన్ ప్రకారం రాగ్యతో సన్నిహితంగా ఉన్న సుపారీ వ్యక్తులు హైదరాబాద్ నగర శివారుకి తీసుకెళ్లి పూటుగా మద్యం తాగించారు. అక్కడే హత్య చేసి మృతదేహాన్ని తీసుకెళ్లి నేరెడు గొమ్ము మండలం కాచరాజుపల్లి పరిధిలోని కృష్ణా బ్యాక్ వాటర్‌లో పడేశారు. ఆగస్ట్ 19 నుంచి భర్త కనిపించడం లేదంటూ భార్య అత్తమామలకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భార్యపై అనుమానం రాగా, ఆమె కాల్ డేటా తీయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. దాంతో సుపారీ గ్యాంగుని అరెస్ట్ చేసిన పోలీసులు మృతదేహం కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అటు తీవ్ర కోపోద్రిక్తులైన గ్రామస్థులు నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.