కొంత మంది ఉంటారు….లక్ష్యం కోసమే బతుకుతారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చినా తాము అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు. ఎవరేమన్నా చెక్కుచెదరరు. అచ్చంగా అలాంటి వ్యక్తిత్వమే వర్షా బుమ్రాది. ఆ పట్టుదలతోనే డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్ విజేతగా నిలిచింది. లక్షల రూపాయలతో పాటూ అంతులేని ఆనందాన్ని, విజయాన్ని సొంతం చేసుకుంది.
వర్షది హరియాణాలోని యాషీ నగర్. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమెకు చిన్న వయసులోనే పెళ్ళైంది. అయితే అది ఆమె లక్ష్య సాధనకు ఏ మాత్రం అడ్డుకాలేదు. కానీ పని చేస్తేనే కడుపు నిండేంద పేదరికం ఆమెది. దాంతో కూలి పనికి వెళ్ళేది వర్ష.కానీ వర్షకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ప్రాణం. యూట్యూబ్ చూస్తూ డాన్స్ నేర్చుకుంది.
వర్ష ఇంట్రస్ట్ ను భర్తకు కూడా ప్రోత్సహించాడు. కానీ డాన్స్ ట్రైనింగ్ కి డబ్బులు మాత్రం ఇవ్వలేకపోయాడు. అయినా ఎక్కడా తగ్గలేదు వర్ష. యూట్యూబ్ లో తన ఫేవరెట్ కొరియోగ్రాఫర్ వర్తికా ఝా వీడియోలు చూస్తూ డాన్స్ నేర్చుకుంది. డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్ గురించి తెలుసుకుంది. అంతే అప్లై చేసింది. వర్షా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ ఇది నీకు అవసరమా అని ఎగతాళి చేశారు. అయినా సరే తన మనసేం చెప్పిందో అదే వింది. డాన్స్ పోటీలకు సెలక్ట్ అయింది. అక్కడే వర్ష దశ తిరిగింది. ఆమె కష్టానికి ఫలితం దక్కింది.
చివర వరకు గట్టి పోటీ ఇచ్చిన వర్షా డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్ సీజన్ 3 విజేతగా నిలించింది. ఆక్షణం ఆమె జీవితంలో మర్చిపోలేనిది అంటుంది వర్ష. కన్నీళ్ళు ఆపుకోలేకపోయా అని చెబుతోంది. వచ్చిన డబ్బులతో తన కొడుకును బాగా చదివించుకుంటానని గర్వంగా చెబుతోంది. వర్షా లాంటి వాళ్ళు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమకు అది లేదు ఇది లేదు అందుకే ఏమీ సాధించలేకపోయాం అని చెప్పుకుని తిరిగే వాళ్ళకు వర్షాలాంటి వాళ్ళ జీవితం ఓ గుణపాఠం.