super star krishna funeral controversy and fans unhappy with mahesh babu
mictv telugu

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలపై కూడా వివాదమేనా ?

November 17, 2022

నచ్చిన వ్యక్తిపై నచ్చినట్టు విమర్శించటం నేటి సోషల్ మీడియా స్వామ్యంలో సహజం అయిపోయింది. ప్రశ్నించటం తప్పు కాదు కానీ వ్యక్తిగత విషయాల్లో హక్కుగా దూరటం మాత్రం తగదు. ఒకవైపు వరుసగా కుటుంబ సభ్యులని పోగొట్టుకుని తీవ్ర దుఃఖంలో ఉన్న మహేష్ బాబుకి సాధ్యమైతే మద్దత్తుగా ఉండాలి కానీ లేనిపోని విమర్శలు చేయటం కరెక్ట్ కాదని ట్రోలర్స్ గుర్తించాలి. ఇక ఈ విషయంలో అభిమానాలు సైతం కాస్త హద్దులు దాటడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణకి మహేష్ బాబు తల కొరివి పెట్టి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అయితే దిగ్గజ నటుడికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడంపై సూపర్ స్టార్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చిరస్థాయిగా నిలిచిపోయేలా స్మారక చిహ్నం నిర్మించే విధంగా పద్మాలయ స్టూడియో వంటి ప్రైవేట్ స్థలంలో దహన సంస్కారాలు చేయాలని మహేష్ ఎందుకు ఆలోచించలేదని ఫ్యాన్స్ అంటున్నారట. పద్మాలయాలో దహనసంస్కారాలు చేసి.. దాన్ని స్మారక చిహ్నంగా నిర్మిస్తే అది చిరస్థాయిగా ఉండి పోతుంది కదా అని వాదిస్తున్నారు.

అయితే గతంలో కృష్ణంరాజుకి తన ఫార్మ్ హౌస్ లో అంత్యక్రియలు చేసి స్మారక చిహ్నం పెట్టించాడు ప్రభాస్. ఇక శోభన్ బాబు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణ సతీమణి విజయ నిర్మల అంత్యక్రియలు కూడా వారి వారి ప్రైవేట్ భూముల్లోనే జరిపి స్మారక మందిరం కట్టించారు. ఇక దివంగత ఎన్టీఆర్ కోసం ప్రభుత్వ స్థలంలో అంత్యక్రియకు చేసి ఎన్టీఆర్ ఘాట్ ని ఏర్పాటు చేసారు. అయితే లెజండరీ నటుడైన కృష్ణకి కూడా వారి సొంత స్థలంలో అంత్యక్రియలు చేసి అభిమానుల కోసం స్మారక చిహ్నం మహేష్ కటించాల్సిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్నీ కొందరు ఖండిస్తున్నారు. తండ్రికి అంత్యక్రియలు ఎక్కడ ఎలా చేయాలో కూడా మనమే చెప్పాలా.. కొడుకుగా మహేష్ బాబుకి ఆ మాత్రం తెలీదా.. పూర్తి వ్యక్తిగత విషయాల్లో పరాయి వావ్యక్తుల జోక్యం అవసరమా.. మహేష్ మనసులో ఏముందో అంటూ మద్దత్తు తెలియజేస్తున్నారు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. తండ్రి కోసం పద్మాలయా స్టూడియోలో ఒక మెమోరియల్ ని ఏర్పాటు చేసే యోచనలో మహేష్ ఉన్నాడట. ఇంతవరకు ఏ హీరోకి లేని విధంగా.. కృష్ణ చేసిన సినిమాలు, సాధించిన రికార్డ్స్, గెలిచిన అవార్డులతో తండ్రి కోసం భారీ మెమోరియల్ ని మహేష్ బాబు నిర్మించనున్నట్టు తెలుస్తుంది.