superstar krishna passes away celebrities pay tribute to hi,
mictv telugu

మహేష్‌బాబుకి నా ప్రగాఢ సానుభూతి :పవన్ కల్యాణ్

November 15, 2022

సూపర్ స్టార్ కృష్ణ మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది . ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ మృతి పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రకటన చేశారు.

“చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్ధకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు.

మద్రాసులో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమకు అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభన్న పాత్రలు పోషించిన కృష్ణగారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు.పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా తనదైన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే కృష్ణగారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరన లోటు. ఆయన కుమారుడు మహేష్ బాబుకి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్ తన సంతాపాన్ని ప్రకటించారు.