Superstar Krishna to be cremated with full state honors Today
mictv telugu

నేడు మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

November 16, 2022

తెలుగు తెర దిగ్గజం, సూపర్‌ స్టార్‌ కృష్ణ మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. లెజెండరీ నటుడు కన్నుమూయడంతో తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. . నిన్న రాత్రి నానక్‌రామ్‌ గూడలోని కృష్ణ నివాసంలో కృష్ణ పార్థివ దేహం సందర్శనార్థం ఉంచారు. ఈ క్రమంలో.. కృష్ణ పార్థివదేహానికి ఇవాళ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. పద్మాలయా స్టూడియోస్‌కు కృష్ణ భౌతికకాయం తరలించనున్నారు.

అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అయితే.. అనంతరం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణం తెలుగు చిత్రపరిశ్రమకు ఓ చీకటి రోజుగా తెలుగు నిర్మాతల మండలి ఓ నిర్ణయంతీసుకుంది. నేడు షూటింగ్‌లు బంద్‌కి పిలుపునిచ్చింది. అంతేకాకుండా పలుచోట్ల కృష్ణ మృతికి సంతాపంగా సినిమా హాల్‌లను మూసివేశారు.

కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు సూచనలు చేశారు. కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.