Superstar Krishna’s Rare Record Difficult For Any Telugu Star To Achieve
mictv telugu

సూపర్ స్టార్ కృష్ట.. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్

November 15, 2022

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. తన రికార్డులను తానే తిరగరాసుకున్న ఆయన.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన ట్రెండ్‌సెట్టర్‌ అనిపించుకున్న సందర్భాలెన్నో.

ఆయన నటించిన తొలి చిత్రం ‘తేనెమనసులు’. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ సోషల్‌ చిత్రం. హీరోగా కృష్ణకు తొలి సినిమా(1965). ఈ సినిమా పలు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. తొలి జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘గూఢచారి 116’. మల్లికార్జున రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ‘డాక్టర్ నో’, ఫ్రమ్ రష్యా విత్ లవ్’ సినిమాలను స్పూర్తిగా తీసుకొని 1966లో తెరకెక్కించారు.

తొలి తెలుగు సినిమా స్కోప్‌ ‘అల్లూరి సీతారామరాజు'(1974). ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా కృష్ణకు 100వ సినిమా. వి. రామచంద్రరావు ఈ సినిమా డైరెక్ట్ చేస్తూ చనిపోయారు. ఆ తర్వాత ఈ సినిమాను కే.యస్.ఆర్.దాస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ఆది నారాయణ రావు అందించిన సంగీతం పెద్ద ఎస్పెట్. ఈ సినిమా రిపీట్ రన్‌లో పలు కేంద్రాల్లో 100 రోజులకు పైగా నడించింది. తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ (తెలుగు వీర లేవరా..). అంతేకాదు హాలీవుడ్‌లో విడుదలైన తొలి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. తొలి ప్యాన్ వరల్డ్ మూవీ చేసిన ఘనత కూడా కృష్ణకే దక్కింది.

తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా ఈనాడు (1982). పర్వతనేని సాంబశివరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. అప్పటికే నంబర్ వన్ హీరోగా ఉన్న కృష్ణ ఈ సినిమాలో హీరోయిన్‌గా లేకుండా నటించడం అనేది ఒక సాహసం. తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం (1986). ఈ సినిమా కృష్ణ స్వీయ దర్శకత్వంలో ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు. ఇప్పట్లో ఈ సినిమాను తెరకెక్కించాలంటే దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని పలు సందర్భాల్లో కృష్ణ వెల్లడించారు. తెలుగులో తొలి 70MM, 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సినిమా ’సింహాసనం’ ను అందించిన ఘనత కృష్ణ దే. ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నారు కృష్ణ.

ఇవే కాదు. ముఖ్యంగా తెలుగు సినిమా ఎదగడానికి తన వంతుగా ఎన్నో ప్రయత్నాలు చేసారు కృష్ణ. ఇతర హీరోలతో పోలిస్తే సాంకేతికంగా చాలా అడ్వాన్స్ సినిమాలు చేసారు. తొలి ఔట్ డోర్ షూటింగ్ సినిమా సాక్షి (1967) ,తొలి ఓ.ఆర్‌.డబ్ల్యు రంగుల చిత్రం ‘గూడుపుఠాణి(1972) ‘, తొలి ప్యూజీ రంగుల చిత్రం ‘భలే దొంగలు’(1976) ‘, తొలి సినిమా స్కోప్‌ టెక్నో విజన్‌ చిత్రం ‘దొంగల దోపిడి’, తొలి ఆర్.వో. సినిమా ‘కొల్లేటీ కాపురం’ (1976), తొలి డిటిఎస్ సినిమా ‘తెలుగు వీర లేవరా’ (1995)..తదితర వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ సొంతం. 1972లో ఈయన 18 సినిమాల్లో నటించాడు. దానికి ముందు 1971లో 11, 1970లో 16 సినిమాలు విడుదల చేశారు.