సింప్లిసిటీకి మారు పేరు తలైవా. నిరాడంబరంగా ఉండే రజినీకాంత్ తన అన్నసత్యనారాయణ రావ్ గైక్వాడ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనకు బంగారు నాణేలతో అభిషేకం చేసి తన ప్రేమను చాటుకున్నాడు.
రజినీకాంత్ సూపర్ స్టార్ గా సినిమాల్లో కనిపిస్తారు. కానీ నిజజీవితంలో మాత్రం చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతాడు. అందుకే ఆయనకు అభిమానులు మరింత బ్రహ్మరథం పడుతుంటారు. ఆయనకు ఆయన కుటుంబం అంటే ప్రాణం. ఇది ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు నెట్టింట తన అన్నకు చేసిన బంగారు నాణేల అభిషేకం వైరల్ అయింది.
ఎమోషనల్ పోస్ట్..
ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాదిలోనూ రజినీకి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా తలైవాకు వీరాభిమానులు ఉన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన అన్నయ్య 80వ పుట్టినరోజు వేడుకలను శనివారం ఘనంగా జరిపారు. అయితే దానికి సంబంధించి సోషల్ మీడియాలో.. ‘మా అన్నయ్య సత్యనారాయణ రావు గారి 80వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. అదే రోజున మా అన్నయ్య కుమారుడు 60వ పుట్టిన రోజు కూడా. బంగారంలాంటి హృదయమున్న మా అన్నయ్యపై బంగారం కురిపించడం అదృష్టంగా భావిస్తున్న. నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఆయనే. అందుకే ఆయనకు కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్ చేశారు రజినీకాంత్.
త్వరలోనే..
బెంగళూరులో జరిగిన ఈ పుట్టిన రోజు వేడుకలకు రజినీకాంత్ తన భార్య లతతో పాల్గొన్నారు. కుమార్తెలు మాత్రం ఈ వేడుకల్లో కనిపించలేదు. కారణం.. వారు శివరాత్రి వేడుకల కోసం పండిట్ రవిశంకర్ నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఇక ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న జైలర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో తెలుగు హాస్య నటుడు సునీల్ కూడా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.