చిన్న సినిమాగా విడుదలై అన్ని భాషల్లో మంచి విజయాన్ని దక్కించుకున్న సినిమా కాంతార. రిషభ్ షెట్టి టేకింగ్, నటనతో దక్షిణాది సినిమా స్థాయిని మరోసారి పెంచాడు. భూతకోల సాంప్రదాయంతో వచ్చిన ఈ సినిమా విదేశాల్లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో ఒక్కసారిగా రిషభ్ షెట్టి ఫేమస్ అయిపోయాడు. బాలీవుడు, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సినీ ప్రముఖులు ఆయనను అభినందించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఇంటికి పిలిచి అతిథి మర్యాదలు చేసి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. ఇదిలా ఉంటే కాంతారకి ప్రీక్వెల్‌గా మరో చిత్రం రానుందని రిషభ్ షెట్టి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రిషభ్‌ని ఇదే ప్రశ్న అడగగా, ఆయన మౌనంగా వెళ్లిపోయారు. దీంతో ఈ వార్త నిజమేననుకుంటున్నారు. ఒకవేళ నిజం కాకపోతే రిషభ్ అక్కడే ఖండించేవాడని, ఏమీ చెప్పలేదంటే కాంతార సిరీస్‌లో రజనీ కనిపించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. కాగా, కాంతార 2 కి సంబంధించిన ప్రిపొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని రిషభ్ వెల్లడించారు. జూన్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ఘనంగా విడుదల చేస్తామని తెలిపారు. మరి ఈ ప్రిక్వెల్ ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.