ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి: జగన్

April 6, 2022

bfbx

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నీ విధాలుగా ఆదుకోవాలని జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. మంగళవారం 4.45 గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లిన జగన్.. రాత్రి 8.05 గంటలకు బయటికొచ్చారు. అంటే సుదీర్ఘంగా ప్రధానితో, జగన్ చర్చించారు. చర్చలో భాగంగా జగన్.. ఆర్ధికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తమ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో… ‘పోలవరం సవరించిన అంచనాలు, రేషన్ పెంపు, భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు, కడప స్టీల్‌ప్లాంట్, రెవెన్యూలోటు భర్తీ, తెలంగాణ నుంచి విద్యుత్తు బకాయిలు, రాష్ట్ర రుణ పరిమితి పై వెసులుబాటు’ కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది.

అంతేకాకుండా కొత్తగా ఏపీఎండీసీకి బీచ్ శాండ్ మినరల్ కేటాయింపు, 12 మెడికల్ కాలేజీలకు అనుమతుల అంశాలను జగన్ చర్చించినట్లు తెలిపాయి. అయితే, జగన్.. మంగళవారం రాత్రి 7. 30 గంటలకు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్, 8.30 గజేంద్రసింగ్ షెకావత్, 9.30 గంటలకు హోంమంత్రి అమిత్ షాలతోనూ సీఎం భేటీ అయ్యారు. ప్రధానితో చర్చించిన పోలవరం, ఆర్ధిక, ఇతరత్రా అంశాలనే వారి దృష్టికి తీసుకెళ్లి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అనంతరం జగన్ రాష్ట్రానికి తిరుగుపయనమవుతున్నారు.

మరోపక్క జగన్..ప్రస్తుత కేబినెట్‌తో చివరిసారిగా గురువారం జగన్ భేటీ కాబోతున్నారు. అనంతరం కొత్త మంత్రివర్గాన్ని నియమించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే, ఇప్పటీకే పేర్ని నాని, డిప్యూటీ సీఎం కృష్ణదాసులు తమ అధ్యాయం ముగిసిందని ప్రకటించిన విషయం తెలిసిందే.