న్యూస్ ఛానెళ్లు, అందులో పని చేసే యాంకర్లు సమాజాన్ని చీలుస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్పీ రేటింగుల కోసం ప్రతీదీ సంచలనాత్మకం చేస్తున్నారని మండిపడింది. సమాజాన్ని అత్యంత ప్రభావితం చేయగల బాధ్యతాయుత స్థానంలో ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికింది. సమాజం పాలిట బెడదగా మారిన విద్వేష ప్రసంగాల ప్రసారాలకు అడ్డుకట్ట వేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను శుక్రవారం జస్టిస్ కె.ఎం. జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నంతో కూడిన ధర్మాసనం విచారించింది.
టీవీ లైవ్ చర్చల్లో చాలా సార్లు యాంకర్లే సమస్యల్లో దూరిపోతున్నారని, ప్యానెల్‌లోని వ్యక్తులు మాట్లాడుతుండగాననే మ్యూట్ చేయడం లేదా వాదన వినిపించే అవకాశం ఇవ్వడం లేదని ఆక్షేపించింది. పత్రికల మాదిరిగా టీవీ ప్రసారాల విషయంలో కూడా నియంత్రణ వ్యవస్థ ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కించపరిచేలా వార్తలు, వ్యాఖ్యానాలు వచ్చాయి. అతను దోషిగా తేలలేదు. విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రతీ ఒక్కరికీ పరువు ప్రతిష్టలుంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి’ అని వ్యాఖ్యానించింది. అలాగే ఢిల్లీలో జరిగిన సంఘటనను ఎత్తి చూపింది. ‘ఓ దొంగ పోలీస్ కానిస్టేబుల్ ని పొడిచినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఛానెళ్లలో, బయటా మాత్రం ఎవరైనా ఏదైనా మాట్లాడే పరిస్థితి నెలకొంది. భావ ప్రకటనా స్వేచ్ఛ గొప్ప బాధ్యత. దానికి భంగం కలుగకుండా ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలి’ అని జస్టిస్ నాగరత్నం అభిప్రాయపడ్డారు. దీనికి స్పందించిన కేంద్రం.. ఈ విషయం కేంద్రం దృష్టిలో ఉందని, ఇలాంటివాటిని అరికట్టేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కు సవరణలు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్ కోర్టుకు తెలిపారు.