దోషులను గద్దెలెక్కకుండా అడ్డుకోలేం.. కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

దోషులను గద్దెలెక్కకుండా అడ్డుకోలేం.. కేంద్రం

March 21, 2018

నేరచరిత ఉన్నవారు రాజకీయాల్లోకి రాకుండా నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్‌పై కేంద్రం బుధవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసుల్లో దోషులుగా తేలిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయ పార్టీలను స్థాపించకుండా అడ్డుకోలేమని తేల్చిచెప్పింది. ఇదంతా ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన విషయమని, కోర్టుకు ఆ విషయంతో ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంది.

నేరస్తులు, దోషులు ఎన్నికల్లో పోటీ చేయకుండా, లేదా దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించడానికి సంబంధించి ప్రస్తుతం చట్టాల్లో ఎలాంటి నిబంధనలూ లేవని సర్కారు పేర్కొంది. పార్టీల నాయకత్వం, సభ్యత్వం వంటివి పార్టీల సొంత నిర్ణయాలని చెప్పుకొచ్చింది. దోషులు పార్టీలు స్థాపించకుండా, విచారణ సమయంలో ఆఫీస్ బేరర్ పోస్టులు చేపట్టకుండా నిషేధం విధించాలని బీజేపీ నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం ఈ అఫిడవిట్ వేసింది. రేపిస్టులు, హంతకులు కూడా పార్టీలు పెడుతున్నారని అశ్వనీ ఆవేదన వ్యక్తం చేశారు.