సైన్యంలో స్త్రీలకు ఉన్నత పదవులు ఇవ్వాల్సిందే.. సుప్రీం - MicTv.in - Telugu News
mictv telugu

సైన్యంలో స్త్రీలకు ఉన్నత పదవులు ఇవ్వాల్సిందే.. సుప్రీం

February 17, 2020

Indian Army

భారత సైన్యంలో లింగ వివక్షపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఇకపై భారత సైన్యంలో మహిళలకు కూడా సమున్నత పదవులు ఇవ్వాలని న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. సైన్యంలో పురుష అధికారులతో సమానంగా స్త్రీలకు కూడా పోస్టులు ఇవ్వాలని ఆదేశించింది. కల్నల్ లేదా అంతకన్నా ఎక్కువస్థాయి పోస్టులు ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. 

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఉండాలన్న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆర్మీలో మహిళలకు ఎన్ని ఏళ్ళ సర్వీసు ఉన్నా.. శాశ్వత కమిషన్ వల్ల కలిగే ప్రయోజనాలు వారికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది. పురుష సిబ్బందితో సమానంగా మహిళలకు కూడా అపాయింట్‌మెంట్లు ఉండాలని ఆదేశించింది. 

అయితే సైన్యంలో ఎక్కువగా గ్రామీణ మహిళలు చేరుతున్నారని, వీరి కారణంగా పురుష అధికారులు ఆత్మన్యూనతతో ఆందోళన చెందవచ్చునన్న కేంద్రం వాదనను కోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో మీ ఆలోచన పరిధి మారాలి అని చురకలు అంటించింది. మీరే జెండర్ వివక్ష చూపుతున్నారని కోర్టు కేంద్రాన్ని తప్పుబట్టింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుకు సైన్యంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.