రూ. 1337 కోట్లు జరిమానా చెల్లించాలని తీర్పిచ్చిన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన టెక్ దిగ్గజం గూగుల్‌కి ఎదురు దెబ్బ తగిలింది. పిటిషన్‌ని కొట్టివేసిన సుప్రీం.. జరిమానాలో పది శాతం వారం రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. అంతేకాక, ఈ కేసును తిరిగి ట్రైబ్యునల్‌కి అప్పగిస్తూ మార్చి 31 వరకు కేసును పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీసీఐ తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరమణన్.. గూగుల్ సంస్థ ఐరోపాలో ఒక విధంగా, భారత్‌లో మరో విధంగా వ్యవహరిస్తోందని, యూరోపియన్ కమిషన్ ఆదేశాలను గూగుల్ పాటిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. వివరాల్లోకెళితే.. ఆండ్రాయిడ్ ప్రొడక్టులకు సంబంధించి గూగుల్ అనైతికంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూ. 1337 కోట్ల జరిమానా విధించింది. దీన్ని ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా, వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ట్రిబ్యునల్ నాలుగు వారాల్లోగా జరిమానాలో పది శాతం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే కోరుతూ గూగుల్ సుప్రీంని ఆశ్రయించింది. తాజాగా పిటిషన్‌ని విచారించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పైవిధంగా ఆదేశాలు జారీ చేస్తూ తీర్పిచ్చింది.