ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ప్రధాని మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీపై రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో బీబీసీని నిషేధించాలని హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా, బీరేంద్ర కుమార్‌లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన సుప్రీం.. ఓ డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని ప్రశ్నించింది. వీడియోను తప్పుగా భావించారని, నిషేధంపై న్యాయస్థానం ఆదేశాలు ఎలా జారీ చేస్తుందని చెప్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అటు బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోకు సంబంధించిన లింకులు ఎక్కడా కనపడకుండా సెన్సార్ విధించింది. దీన్ని సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎన్. రామ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాలతో పాటు మరో న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీం ఇటీవల విచారించింది. అనంతరం వీడియోను అడ్డుకుంటూ జారీ చేసిన ఉత్తర్వుల పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది.