సినిమా థియేటర్లలో టిక్కెట్ల రేట్లు ఓ వైపు అక్కడ లభించే స్నాక్స్, కూల్ డ్రింక్స్‌ల రేట్లు మరోవైపు ప్రేక్షకుల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఈ కారణంగానే కొంత శాతం ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కి వెళ్తే హీనపక్షం రెండు వేల రూపాయలు ఖర్చవుతుంది. దీనిపై ఇండస్ట్రీ పెద్దలకు కూడా థియేటర్ యజమానులతో చర్చలు జరిపారు. అయినా పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. తాజాగా సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాన్ని విచారిస్తూ థియేటర్ యజమానులకు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేసింది. సినిమా హాళ్లు యజమానుల ప్రైవేట్ ఆస్తులు కాబట్టి రేట్లు, షరతులు పెట్టే అర్హత వారికుందని తేల్చి చెప్పింది. ఈ షరతులు లేదా రేట్లు ప్రజాప్రయోజనాలకు, భద్రతకు, సంక్షేమానికి విరుద్ధంగా లేనంతవరకు యజమాని నిబంధనలు, షరతులు పెట్టవచ్చని స్పష్టం చేసింది. తినుబండారాలను కచ్చితంగా తీసుకోవాలనే నిబంధన లేదు కాబట్టి ప్రేక్షకుడు ఇష్టమైతే తీసుకుంటాడు లేదా వద్దనుకుంటాడని, ఇందులో బలవంతం ఏమీ లేదని తెలిపింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పునిచ్చింది.