2016 నవంబర్ 8న మోదీ ప్రభుత్వం పాత రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వచ్చాయి. అంతే కాదు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 50కి పైగా పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే విచారణను ముగించి తీర్పును రిజర్వు చేసింది. రిజర్వ్ చేసిన తీర్పును సోమవారం (జనవరి 2న) వెల్లడించనున్నది. విశేషమేమిటంటే.. ఈ తీర్పు వెలువడిన మరుసటి రోజే.. జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ ఎస్ ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 2న తీర్పు వెలువరించనుంది. సోమవారం నాటి సుప్రీం కోర్టు కాజ్ లిస్ట్ ప్రకారం.. ఈ విషయంలో రెండు వేర్వేరు తీర్పులు ఉంటాయి, వీటిని జస్టిస్ బిఆర్ గవాయ్ , జస్టిస్ బివి నాగరత్న ప్రకటిస్తారు. ఈ రెండు నిర్ణయాలూ ఏకీభవిస్తాయా లేక భిన్నాభిప్రాయాలకు లోనవుతాయా అనేది స్పష్టంగా తెలియలేదు.