కారుణ్య మరణానికి సుప్రీం కోర్టు ఓకే.. కానీ - MicTv.in - Telugu News
mictv telugu

కారుణ్య మరణానికి సుప్రీం కోర్టు ఓకే.. కానీ

March 9, 2018

వివాదాస్పదంగా మారిన కారుణ్య మరణం(యూథనేసియా) డిమాండ్‌పై సుప్రీం కోర్టు ఎట్టకేలకు తీర్పిచ్చింది. ఈ మరణానికి కొన్ని షరతులతో అనుమతి మంజూరు చేసింది. జీవించడం ఇష్టలేనివారు అచేతనంగా బాధపడుతూ ఉండకూడదని స్పష్టం చేసింది. రోగులు నయంకాని కోమాలోకి వెళితే లైఫ్ సపోర్ట్ మీద ఉంచకుండా, మరణానికి అనుమతివ్వాలని ‘లివింగ్ విల్’(సజీవ వీలునామా) రాసేందుకు కూడా ఓకే చెప్పింది. అయితే దీనికి కుటుంబ సభ్యుల, వైద్యుల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.కోమాలోకి వెళ్లే ప్రమాదమున్న వ్యక్తికి చేయాల్సిన చికిత్స, జీవించాలా, చనిపోవాలా అన్న దానిపై రాసుకునే వీలునామాను లివింగ్ విల్లుగా పేర్కొంటారు. అయితే ఇది సమంజసం కాదని, ఆత్మహత్య నేరం కనుక ఇది కూడా నేరమేననే వాదన ఉంది. నయంకాని వ్యాధులతో బాధపడుతూ కోలుకోవడానికి అవకాశం లేనివారు, కృత్రిమ శ్వాసతో యాతన పడకుండా అనాయాస మరణానికి అనుమతి ఇవ్వాలని ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కేసును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల బెంచ్  విచారించింది. వారి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా లివింగ్ విల్లుకు అనుమతివ్వాలని ఏకాభిప్రాయం వ్యక్తమైంది.