ఏపీ స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీం ఆదేశం  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీం ఆదేశం 

May 20, 2020

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. టీడీపీ నేతలు వేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ జనానా పాతిపధికన రిజర్వేషన్లు చేసినా 50 శాతాన్ని దాటకూడదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసును ప్రస్తావించింది. అప్పటి తీర్పును కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి సూచించింది. 

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని టీడీపీ నేతలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. బీసీలకు అన్యాయం జరిగిందని,నిబంధనల ప్రకారం కేటాయింపులు జరగలేదని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం తాజా తీర్పు వెల్లడించింది. గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా కోర్టు సమర్థించింది. కాగా ఈ కేసు వేసిన వారిలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాసలు సహా పలువురు నేతలు ఉన్నారు.