స్పీకర్‌కు ఆ అధికారాలు అవసరమా..సుప్రీం కీలక సూచనలు - MicTv.in - Telugu News
mictv telugu

స్పీకర్‌కు ఆ అధికారాలు అవసరమా..సుప్రీం కీలక సూచనలు

January 21, 2020

nnhjh

ప్రస్తుత రాజకీయాల్లో గోడ దూకుడు చర్యలు పెరిగిపోయాయి. అధికారం లేకపోయే సరికి ఒక పార్టీలో గెలిచిన వారు మరో పార్టీలో చేరిపోవడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్‌కు అధికారాలు కూడా కల్పించారు. కానీ దీని ద్వారా పెద్దగా ప్రయోజనం లేదనే వాదనలు కూడా అనేక సార్లు వ్యక్తం అయ్యాయి. ఇటువంటి సందర్భంలో పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు ప్రస్తుతమున్న నిర్ణయాధికారంపై ఆలోచించాలని పేర్కొంది.

మణిపూర్ మంత్రి శ్యాంకుమార్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్‌ కూడా ఒక పార్టీకి చెందిన వ్యక్తే కాబట్టి అనర్హత వేటు వేసే విషయంలో నిర్ణయాధికారం స్పీకర్‌కు ఉండవచ్చా లేదా అనే అంశంపై పార్లమెంట్ పునరాలోచించాలని కోరింది. మరోవైపు మంత్రి శ్యాం కుమార్‌పై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీం ఆదేశించింది. ప్రస్తుత రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో న్యాయమూర్తులు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని పెంచాయి. 

కాగా కాంగ్రెస్‌ నుంచి గెలిచిన శ్యామ్‌కుమార్, ఆ తర్వాత బీజేపీలో చేరి మంత్రి  అయ్యారు. పార్టీ మారిన ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌ను కాంగ్రెస్ పార్టీ కోరింది. అయినా చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణలో భాగంగా పార్లమెంట్‌కు పలు కీలక సూచనలు చేశారు.