Supreme Court order to transfer cases registered against Nupur Sharma to Delhi
mictv telugu

నుపుర్ శర్మకు సుప్రీంలో భారీ ఊరట.. కీలక ఆదేశాలు జారీ

August 10, 2022

టీవీ డిబేట్‌లో మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో బుధవారం భారీ ఊరట కలిగింది. దేశ వ్యాప్తంగా తనపై నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని ఆమె వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. సానుకూలంగా స్పందించింది. నుపుర్ శర్మపై ఇప్పటివరకు నమోదైన, భవిష్యత్తులో నమోదయ్యే కేసులను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగమైన ఐఎఫ్ఎస్ఓకు బదిలీ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాక, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్టు చేయడానికి వీల్లేదని తెలిపింది. ఈ విషయంలో ఇప్పటివరకు రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంతేకాక, ఇప్పటివరకు తనపై నమోదైన కేసుల వ్యవహారంలో వ్యతిరేక పిటిషన్లను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయవచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే బెంచ్ నుపుర్ శర్మను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇంటెలిజెన్స్ ప్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ) అనేది ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైం విభాగం. దీని ఆఫీసు ద్వారకాలో ఉండగా, ప్రధానమైన కేసులు, సున్నితమైన అంశాలను ఈ విభాగం దర్యాప్తు, పరిశీలన చేస్తుంది.