సుప్రీం కోర్టులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు చుక్కెదురైంది. సిసోడియా బెయిల్ పిటిషన్ స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమైతే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. దీనిపై తదుపరి విచారణకు నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆదివారం ఆరెస్టైన మనీశ్ సిసోడియా సుప్రీంను ఆశ్రయించడంతో నేడు విచారణ జరిగింది. ఈ కేసుపై తాము తాము విచారణ చేయబోమని సిసోడియాకు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. నేరుగా సుప్రీం కోర్టుకు వచ్చే ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.దీనిపై అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ.. జర్నలిస్ట్ వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు. ఆ కేసు వేరని సుప్రీం తెలిపింది. ఈ కేసు విచారణపై స్టే ఇచ్చి..తనకు బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా కోరగా అయితే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది.