Supreme Court Refuses To Give Stay On ED Notice To BRS MLC Kavitha
mictv telugu

కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

March 15, 2023

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు ఈడీ (ED) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అయితే ఈడీ విచారణకు ముందే ఆమె ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు.

మహిళ అయిన తనను ఈడీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారనీ… హడావుడిగా దర్యాప్తు చేసి.. ప్రశ్నించేందుకు సిద్ధమైపోయారని ఆమె తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్‌ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ కేసులో కవితకు చుక్కెదురైంది. ఆ పిటిషన్‌పై విచారణ తీసుకుంటామని పేర్కొన్న సీజేఐ… మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 24కు వాయిదా వేసింది. దీంతో రేపు ఈడీ విచారణకు కవిత కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం… సీబీఐ దర్యాప్తులో… తాము ప్రశ్నించాలనుకున్న వారిని సీబీఐ ఎక్కడికి రావాలో అడుగుతుంది. వారు చెప్పిన చోటికే సీబీఐ అధికారులు వెళ్లి ప్రశ్నిస్తారు. కానీ ఈడీ విషయంలో అలా జరగదు. ఈడీ అధికారులు చెప్పిన చోటికే… నిందితులు వెళ్లి… విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో మహిళలకు కొంత వెసులుబాటు ఇవ్వాలని కవిత కోరిన పిటిషన్‌ను సుప్రీం నేడు నిరాకరించింది.