ఎన్నికల గుర్తు‘విల్లు-బాణం’పై పోరాటంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి మరో ఎదురుదెబ్బ తగలింది. సుప్రీం కోర్టులో కూడా నిరాశే మిగిలింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించడంపై.. ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్ పిటిషన్ విచారణకు స్వీకరించింది.
పార్టీపేరును, గుర్తును ఒక వర్గానికి కేటాయించిన ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని థాక్రే వర్గం సుప్రీంను కోరింది. అయితే అందుకు అత్యున్నత న్యాయం స్థానం నిరాకరించింది. ఈసీ నిర్ణయంపై స్టే విధించలేమన తెలిపింది. మరోవైపు ఈసీ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు శిండే వర్గానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. రెండువారాల్లోగా జవాబివ్వాలని ఆదేశించింది. మరో వారం రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది.
ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే వర్గానిదే అసలైన శివసేన అని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ కూడా శిండే వర్గానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్ శుక్రవారం 78 పేజీల ఆదేశాలు విడుదల చేసింది. దీనిపై సుప్రీంలో థాక్రే పిటిషన్ వేశారు.