ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రేపు మరొకసారి విచారణకు హాజరుకానున్నారు కవిత. దీంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని, ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది
ఈ పిటిషన్‌లో ఈడీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా ఈడీ వేధిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన విషయంలో నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారని..అధికారి పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసులో తన పేరు ఎక్కడా లేకపోయినా కావాలని ఇరికిస్తున్నారని వాపోయారు. తనను కేసులోకి లాగడం కోసం కొంతమంది ఈడీ బెదిరిస్తోందని..వారి ద్వారా తన పేరు చెప్పిస్తున్నారని ఆరోపించారు.
ఇందుకోసం థర్డ్ డిగ్రీ సైతం ఈడీ ప్రయోగిస్తున్నారని కవిత పిటిషన్‌లో వెల్లడించారు. చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టారని తెలిపారు. అరుణ్ రామచంద్ర పిళ్లైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారన్నారు. ఎటువంటి సమాచారం లేకుండానే మొబైల్ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా..అలా జరగడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకుంటున్నట్లు సీజేఐ ధర్మాసనం తెలిపింది.
మరోవైపు నేడు కవిత ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతరు నేతలతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు.అన్నీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై ఒత్తడి పెంచేందుకు కవిత నేతృత్వంలోని సాంస్కృతిక సంస్థ భారత్ జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.