సుప్రీంకోర్టులో జస్టిస్ కర్ణన్ మళ్లీ ఝలక్ - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీంకోర్టులో జస్టిస్ కర్ణన్ మళ్లీ ఝలక్

May 15, 2017

 

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. తనపై జారీచేసిన అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణన్‌ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

కోర్టు ధిక్కార కేసులో జస్టిస్‌ కర్ణన్‌ను సుప్రీంకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తాను బేషరుతుగా క్షమాపణ చెబుతానని జస్టిస్‌ కర్ణన్‌ ఇప్పటికే న్యాయస్థానాన్ని అభ్యర్థించినా.. దాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. తాజాగా అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, కేసులో విచారణను వేగవంతం చేయాలని జస్టిస్‌ కర్ణన్‌ తరఫు న్యాయవాది పిటిషన్‌ వేశారు. దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేసింది. ‘విలువైన కోర్టు సమయాన్ని మీరు వృథా చేస్తున్నారు. పిటిషన్‌ వచ్చినప్పుడు విచారణ చేస్తాం కదా’ అంటూ చీవాట్లు పెట్టింది.

కోర్టు ధిక్కార కేసులో జస్టిస్‌ కర్ణన్‌ను వెంటనే అరెస్టు చేసి, జైలు శిక్ష అమలు చేయాలని కోల్‌కతా పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కోర్టు తీర్పుకు కొద్ది గంటల ముందే కోల్‌కతా విడిచి వెళ్లిన జస్టిస్‌ కర్ణన్‌ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. చెన్నైలోనే ఉన్నారని జస్టిస్‌ కర్ణన్‌ తరఫు న్యాయవాది చెబుతున్నప్పటికీ.. ఆయన మాత్రం పోలీసులకు దొరకడంలేదు.

HACK:

  • Supreme court rejects Justice Karnan petition.