Supreme Court relief to Maharashtra rebel MLAs, extends response deadline to July 12
mictv telugu

రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంలో ఊరట.. పదవులు సేఫ్

June 27, 2022

Supreme Court relief to Maharashtra rebel MLAs, extends response deadline to July 12

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు, వారి లీడర్ ఏక్ నాథ్ షిండేకి సుప్రీం కోర్టు ఆదేశాలతో గుడ్ న్యూస్ వచ్చింది. ఏక్ నాథ్ షిండేతో పాటు శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మీద ఒత్తిడి తీసుకువచ్చింది. డిప్యూటీ స్పీకర్ శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని ప్రయత్నించారు. అయితే శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యకూడదని డిప్యూటీ స్పీకర్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి , డిప్యూటీ స్పీకర్‌ , మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత 3 రోజుల్లోగా రిజాయిండర్‌ దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతేకాదు.. జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించింది. దీంతో.. అనర్హత నోటీసుల విషయంలో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్టయింది.

షిండే తో పాటు మరో 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు శనివారం అనర్హత వేటు నోటీసులు జారీ చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్. 48 గంటల్లోగా(సోమవారం నాటికి) రిప్లయి తెలపాలని కోరారు. దీన్ని సవాల్ చేస్తూ ఏక్నాథ్ షిండే.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు 38మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ప్రస్తుతం మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని వాదించారు.