దీపావళి వెలుగులకు ఆటంకం తొలగిపోయింది. బాణసంచా అమ్మకం, వాడకంపై నిషేధం విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఈ రోజు సవరించింది. దీపావళి పండగ రోజున రాత్రిపూట 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలకు కొంత ఊరట లభించింది. అయితే వ్యాపారస్తులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర హైకోర్టు విధించిన నిషేధాన్ని తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీం బెంచ్.. గాలి నాణ్యత సూచీల ఆధారంగా ఆంక్షలు విధించింది. ఈనెల 9న జాతీయ హరిత ట్రైబ్యునల్ జారీచేసిన ఆదేశాలకు పాటించాలని స్పష్టం చేసింది. తెలంగాణలో గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్నచోట పటాకులు కాల్చొద్దని పేర్కొంది, నాణ్యత సాధారణంగా ఉన్నచోట పర్యావరణ అనుకూల గ్రీన్ క్రాకర్స్‌ను రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కాల్చుకోవచ్చని తెలిపింది.
దేశంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట బాణసంచా క్రయవిక్రయాలపై హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది. గాలి నాణ్యత సాధారణంగా ఉంటే రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాణసంచా కాల్చుకోవచ్చని మినహాయిపు ఇచ్చింది. కరోనా కేసులు పెరగడాన్ని, వాయి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పటాకులపై నిషేధం విధించాలని కూకట్‌పల్లికి చెందిన ఇంద్రప్రకాశ్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేయడం, కోర్టు నిషేధం విధించడం తెలిసిందే. కోర్టు తీర్పును ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో సవాలు చేసింది.