శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

November 14, 2019

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించాల్సి ఉందని అభిప్రాయపడింది. మత విశ్వాసం అనేది ప్రతి పౌరుడి హక్కు కాబట్టి తాము దీనిపై ఎటువంటి నిర్ణయం వెల్లడించలేమని తేల్చారు. ఇంకా దీనిపై విస్తృత చర్చ జరగాలంటూ వ్యాఖ్యానించింది. 

ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగించడాన్ని 3:2 ప్రాతిపధికన ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూద్ విభేదించారు. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గతేడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందు నిరాకరించింది. వెళ్లాలా వెళ్లకూడదా అనేది మహిళల ఇష్టం అంటూ వ్యాఖ్యానించింది. గత ఏడాది ఇచ్చిన తీర్పుపై తామేమి స్పందించలేమని పేర్కొన్నారు. సుప్రీం తాజా నిర్ణయంతో మరోసారి ఈ కేసుపై విచారణ పర్వం కొనసాగనుంది. 

Supreme Court.

మత విశ్వాసాల్లోకి చొచ్చుకుని వెళ్లే అధికారం కోర్టులకు ఉందా.. అనే అంశం ఇప్పుడు చర్చకు వచ్చిందని ధర్మాసనం పేర్కొంది. మసీదుల్లో మహిళలకు ప్రవేశం కూడా చర్చకు వస్తోన్నట్టుగా న్యాయమూర్తులు చెప్పారు. దీనిపై ఇంకా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఉందని స్పష్టంగా తెలియజేసింది. 

కాగా, కోర్టు తాజా తీర్పుతో అయ్యప్ప సన్నిధికి అదనపు బలగాలను పంపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరో రెండు రోజుల్లో ఆలయం తలుపులు మండల పూజ కోసం 40 రోజుల పాటు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది జరిగినట్టుగా మహిళల ప్రవేశం.. వారిని అడ్డుకునే ప్రయత్నాలు జరగకుండా ముందస్తు చర్యలను చేపట్టింది.