వారి భయం వైరస్‌కన్నా ప్రమాదం.. సుప్రీం కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

వారి భయం వైరస్‌కన్నా ప్రమాదం.. సుప్రీం కోర్టు

March 31, 2020

Supreme Court Seeks Report From Government On Steps To Prevent Migration Of Worker

లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఓవైపు ఉపాధిని కోల్పోయిన వేలాది మంది తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, వారిని ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నచోట నుంచి పంపిచవద్దని ప్రభుత్వం వారిని ‌ఆపేస్తోంది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని షెల్టర్ హోమ్స్‌‌కు తరలించాయి. ఈ నేపథ్యంలో‌ వారి బాగోగులపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది. ‘నిలిపివేసి షల్టర్ హోమ్స్‌కు తరలించిన వలసకూలీల ప్రతి ఒక్కరి బాధ్యత మీదే. వారందరికీ పౌష్టికాహారం, వైద్య సదుపాయాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి’ అని ఆదేశించింది. 

21 రోజుల లాక్‌డౌన్‌తో వలసదారులు తమ ఉద్యోగాలను కోల్పోయి అనేక భయాందోళనల్లో ఉన్నారని తెలిపింది. వారిలో నెలకొన్న భయాలు వైరస్ కన్నా ప్రమాదం అనీ.. నిపుణులైన కౌన్సెలర్లతో వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించింది. ‘వారంతా భజనలు, కీర్తనలు పాడుకోవచ్చు. నమాజ్ చేసుకోవచ్చు. వారికి మనోధైర్యాన్ని కలిగించే పనులను చేసుకోనివ్వండి. ఒక్కొక్కరి మధ్య సామాజిక దూరం తప్పనిసరిగా ఉండేలా చూడాలి. తరచూ షెల్టర్ హోమ్స్‌ను కమ్యూనిటీ లీడర్లు సందర్శిస్తూ.. వారికి ధైర్యం చెప్పాలి’ అని పేర్కొంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. మరో 24 గంటల వ్యవధిలో నిష్ణాతులైన కౌన్సెలర్లను, మతాధికారులను వారి వద్దకు పంపిస్తామని అన్నారు. వారిలో ధైర్యాన్ని నింపేందుకు పాస్టర్లు, మౌల్సీలు, సాధువులను పంపనున్నట్టు వెల్లడించారు.