భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రింకోర్టు) స్త్రీ, పురుషుల సహజీవనం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ”స్త్రీ, పురుషుల మధ్య దీర్ఘకాలంగా సహజీవనం కొనసాగితే, అది అక్రమ సంబంధంగా భావించకూడదు. దానిని వివాహ బంధంగానే పరిగణించాలి. అంతేకాదు, వారికి పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా కూడా ఇవ్వాలి” అని తేల్చి చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ జంట దీర్ఘకాలంగా సహజీవనం చేస్తోంది. వారికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. కానీ, వారిద్దరు వివాహం చేసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు. దాంతో కేరళ హైకోర్టు.. వారికి పుట్టిన బాబును అక్రమ సంతానంగా పేర్కొంటూ, పూర్వీకుల ఆస్తిలో అతడికి వాటా దక్కదని 2009లో తీర్పును వెలువరించింది. దీంతో బాధిత జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజాగా వీరి పిటిషన్‌ను జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. కేరళ హైకోర్టు తీర్పుతో విభేదించింది. ఓ జంట దీర్ఘకాలంగా సహజీవనం చేస్తుంటే వారు వివాహం చేసుకున్నట్టుగానే పరిగణించాలని సుప్రింకోర్టు పేర్కొంది. వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్ప, వారి బంధాన్ని భార్యాభర్తల్లానే పరిగణించాలని స్పష్టం చేసింది. పెళ్లి విషయానికొస్తే.. వారు పెళ్లి చేసుకోలేదని నిరూపించాల్సిన బాధ్యత మాత్రం సవాల్ చేసిన వారిపైనే ఉంటుంది అని తెలిపింది. ఇక ఆస్తి విషయానికొస్తే, పంపకం దావాల్లో ప్రాథమిక డిక్రీ ఇచ్చిన వెంటనే తుది డిక్రీ జారీకి చర్యలు ప్రారంభించాలంటూ అన్ని కోర్టులను సుప్రీం ఆదేశించింది.