Supreme Court Serious on CBI Over Viveka's Murder case investigation
mictv telugu

వివేక హత్యకేసు.. సీబీఐ దర్యాప్తుపై సుప్రీం అసహనం

March 27, 2023

Viveka's murder case: Supreme Court Serious on CBI Over Viveka's Murder case investigation

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును ఇంకెంత కాలం విచారిస్తారని సీబీఐని సుప్రీం ప్రశ్నించింది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ.. దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారించింది. దర్యాప్తు వేగంగా సాగటం లేదని.. దర్యాప్తు అధికారులు మార్చాలన్నది ఆ పిటిషన్ సారాంశం.

సోమవారం విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం.. వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. కేసు అంతా… రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదేనని రిపోర్ట్‌లో రాశారని జస్టిస్‌ ఎంఆర్‌ షా పేర్కొన్నారు. హత్యకు గల ప్రధాన కారణాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణాధికారిని మార్చాలని.. లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పుడున్న అధికారి కూడా కొనసాగుతారని తెలిపింది.

సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక ఆసాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి డెవలప్‌మెంట్ లేదని అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు పేరుతో ఇంకెంతకాలం సాగదీస్తారని నిలదీసింది. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారని.. విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేసింది. మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని పేర్కొన్న ధర్మాసనం.. కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.