Supreme Court Upholds Quota for EWS
mictv telugu

EWS రిజర్వేషన్లు…మోదీ బిగ్ విక్టరీ…

November 7, 2022

EWS రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడంలో మోదీ ప్రభుత్వం బిగ్ విక్టరీ సాధించింది. విద్యా, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వేళ వచ్చినా ఈ నిర్ణయం బీజేపీకి ప్లస్ కాబోతోందా?

సవాల్ పిటిషన్లు

అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. 10శాతం కోటా ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఉల్లంఘనగా మారదా అనే అంశాలను పిటిషనర్లు లెవనెత్తారు. అలాగే ప్రయివేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు వీలుగా ప్రత్యేక ప్రొవిజన్లు తేవడానికి కేంద్రాన్ని అనుమతించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఉల్లంఘనగా మారుతుందా అనే అంశాలను కూడా ప్రశ్నించారు.

103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6)లను రాజ్యాంగంలో చేర్చారు. వీటి ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. వారి కుటుంబ గరిష్ట వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించరాదన్న నిబంధనను కూడా చేర్చారు. అయితే 1992లో ఇందిరా సహానీ (మండల్ కమిషన్) కేసులో సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని ఇచ్చిన తీర్పును 103వ రాజ్యాంగ సవరణ ఉల్లంఘిస్తోందని కూడా పిటిషనర్లు లేవనెత్తారు. అసాధారణ పరిస్థితుల్లో తప్ప రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఇందిరా సహానీ కేసులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

సుప్రీం సమర్థన

ఈ పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటాపై తీర్పుని వెల్లడించింది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం కోటా రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు జడ్జిలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించారు. వీరిలో ఓ జడ్జి భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.