అయోధ్య కేసులో తుది తీర్పు రేపే.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య కేసులో తుది తీర్పు రేపే.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్

November 8, 2019

దేశప్రజలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ముహూర్తం కొన్ని గంటల్లో రాబోతోంది. వివాదాస్పద అయోధ్య భూమి కేసులో సుప్రీం కోర్టు రేపు(శనివారం) తుది తీర్పు వెలువరించనుంది. పొద్దున 10:30 గంటలకు తీర్పు రానుంది. తీర్పు నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అయోధ్యలో పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర బహిరంగ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో 40 వేల మంది భద్రతా సిబ్బంది నిఘా పెట్టారు. 

Supreme Court.

అయోధ్య తీర్పు పర్యవసానాలను ఎదుర్కోడానికి కేంద్రం ప్రజలను చైతన్యవంతం కూడా చేస్తోంది. తీర్పుపై ఎవరూ రెచ్చగొట్టేలా బహిరంగ ప్రకటనలు చేయొద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను ఆదేశించారు. సోషల్ మీడియాలోనూ వివాదాస్పద పోస్టులు పెట్టొద్దని పోలీసులు కూడా హెచ్చిరిస్తున్నారు. 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపిన కోర్టు సీజేఐ రంజన్ గొగోయ్ తీర్పును రిజర్వులో ఉంచడం తెలిసిందే. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రాంలల్లాలు వివాదాస్పద 2.77 భూమిని సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై కోర్టు తీర్పు వెలువరించనుంది.