కర్నాటక రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

కర్నాటక రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

November 13, 2019

కర్నాటకలో అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. 17 మందిని అనర్హులుగా పరిగణించడం సరైనదేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే వీరంతా ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. 2023 వరకు సభాకాలం ముగిసేదాకా ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కొట్టివేశారు. ఇప్పటికే కర్నాటకలో ఉప ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థులు నామినేషన్లకు సిద్ధమౌతున్నారు. 

Supreme Court Verdict.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కుమార స్వామి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. దీంతో వారిపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ సర్కార్ కొలువుదీరింది. కాగా ఇప్పటికే ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాలకు గానూ 15 చోట్ల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 11 నుంచి 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు స్వీకరించనున్నారు. వచ్చే నెల 5న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. తాజా తీర్పు నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్ ఇస్తుందా.. ఈ సారి ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది.