సోషల్ మీడియాకు సూపర్ న్యూస్ ! - MicTv.in - Telugu News
mictv telugu

సోషల్ మీడియాకు సూపర్ న్యూస్ !

June 29, 2017

సోషల్ మీడియాలో ఇక నుండి ఎవరికి నచ్చిన భావాలను వాళ్ళు నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో కొందరి నాయకుల కొండ నాలుక తెగినంత పనైంది !? మంచిగా రాస్తే మొగులుకు ఎత్తుకోవడం, కాస్త తేడాగా రాస్తే వాళ్ళను అరెస్టులకు దారి తీస్తున్న లీడర్ల పప్పులు ఇక నుండి సోషల్ మీడియాలో ఉడకవు అంటున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2000 చట్టంలోని సెక్షన్-66 A ను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ యాక్ట్ – 2000లోని సెక్షన్-66 A అనేది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందని.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్భంగా పేర్కొంది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేవిధంగా ఉన్నందువల్ల ఈ సెక్షన్ చట్టసమ్మతం కాదని ధర్మాసనం తెలిపింది.

ఆ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ మీద, అక్కడ వారి పరిపాలన మీద సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

అప్పుడు ఈ ఇష్యూ మీద చాలా మంది నెటిజన్లు గుస్సా అయ్యారు. సామాన్యుడికున్న ఏకైక వజ్రాయుధం సోషల్ మీడియానే. ఎలాగో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు పార్టీకొకటిగా పంచుకొని కొమ్ము కాస్తున్నాయి. పత్రికలు, టీవీలు చెప్పిందే నిజమని నమ్మే రోజులకు మంగళం పాడింది సోషల్ మీడియానే. సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది ఒక సామాజికి బాధ్యతగా తమకు నచ్చిన, నచ్చని భావాలను యధేచ్ఛగా బహిర్గతం చేస్తున్నారు. ఇదెంతో హర్షించదగ్గ విషయం.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అరెస్టుల విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ‘సెక్షన్-66A ద్వారా పౌరుల ఆలోచనా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నేరుగా ప్రభావం పడుతోంది. ఒక వ్యక్తికి అభ్యంతరకరమైంది మరో వ్యక్తికి అభ్యంతరకరం కాకపోవచ్చు. మన రాజ్యాంగం.. పౌరులకు స్వేచ్ఛ, ఆలోచనలను వ్యక్తీకరించే హక్కును ప్రసాదించింది. వీటికి భంగం వాటిల్లేవిధంగా ఎలాంటి నిబంధనలను అంగీకరించేది లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను పూర్తిగా కొట్టేస్తున్నట్లు తెలిపింది.

తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనే సోషల్ మీడియా తన స్టేటస్ ను దక్కించుకుంది. ఇది నిజంగా సోషల్ మీడియాకు సూపర్ న్యూసే మరి. లేదంటే ఎవరికి నచ్చిన నాటకం వాళ్ళేస్తుంటే అందరూ కళ్ళు చికిలించి చూస్తూ చెక్క భజన చేస్కోవాల్సి వస్తుండే. ఇక నుండి రాజకీయ నాయకులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొనైనా వ్యవహరించాల్సి వస్తుంది. లేదంటే అవినీతి చేపల్ని ఎండబెట్టడానికి సోషల్ మీడియా అనే అతి పెద్ద ఇసుక మైదానం రెడీగా వుంటుంది !