జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీం కీలక ఆదేశాలు - MicTv.in - Telugu News
mictv telugu

జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీం కీలక ఆదేశాలు

May 20, 2022

జ్ఞానవాపి మసీదు వివాదంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పిటిషనర్ వాదనను విన్న ధర్మాసనం ఇదొక సున్నితమైన, సంక్లిష్టమైన విషయంగా వర్ణించింది. ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, ఈ వివాదంపై జిల్లా కోర్టులోనే విచారణ జరపాలని ఆదేశించింది.

మసీదులో బయటపడిన శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజు కూడా చేసుకోవచ్చనే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పునరుద్ఘాటించింది. అంతేకాక, జిల్లా కోర్టులో విచారణకు సమయాన్ని నిర్దేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశిస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, సర్వే వీడియో రిపోర్టులోని అంశాలు బయటకు లీక్ అవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మే 23 సోమవారం రోజున వారణాసి జిల్లా కోర్టులో ఈ అంశం విచారణకు రానుంది.