Supreme notice to Telangana government on murder of lawyer Vaman Rao couple
mictv telugu

లాయర్ దంపతుల హత్యలపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

September 9, 2022

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లాయర్ గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని పిటిషనర్ వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మరణ వాంగ్మూలంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేరు చెప్పినప్పటికీ పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారని సుప్రీంకోర్టుకు న్యాయవాది తెలిపారు. దీంతో శుక్రవారం… పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీతో సహా 12 మంది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

గతంలో ఈ జంట హత్యలపై పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగానే జరుగుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. హత్యలపై సీబీఐ విచారణ కోరుతూ మృతుడి తండ్రి గట్టు కిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో కిషన్‌రావు సుప్రీంను ఆశ్రయించారు.

17 ఫిబ్రవరి 2021 న రామగిరి మండలం కలవచర్లలో కారులో వెళ్తున్న అడ్వకేట్ దంపతులు వామనరావు, నాగమణిని అడ్డగించి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులను సైడ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.