నల్లకోటు లేకుండానే విచారణ.. సుప్రీం కీలక నిర్ణయం
కరోనా కారణంగా న్యాయ స్థానాల్లో కేసుల విచారణ తగ్గిపోయింది. కొన్ని అత్యవసర కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహిస్తున్నారు. కోర్టుకు వచ్చే పనిలేకపోడంతో న్యాయవాదులు నల్లకోటు వేసుకునే విషయంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నల్లకోటు వేసుకోకుండానే విచారణకు హాజరుకావాలని జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆదేశించారు. ఈ మహమ్మారి ప్రభావం తగ్గే వరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
విచారణ సమయంలో సంప్రదాయ నలుపు రంగు కోట్లు కచ్చితంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు ధరించాలి. కానీ ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణలు జరుగుతున్నాయి. దీనికి తోడు నిండుగా ఉండే గౌన్ల కారణంగా కరోనా వైరస్ సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెల్ల చొక్కా, నెక్ బ్యాండ్ ధరించి విచారణ చేపట్టిన ఎస్ఏ బోబ్డే, సహచర న్యాయమూర్తులు, లాయర్ల నలుపు రంగు కోట్లు, గౌన్లు ధరించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కొంత కాలం వీటిని పక్కన పెడదామని సూచించారు. న్యాయవాదులు డిజైన్లు లేని తెలుపు చొక్కా, మహిళలు సల్వార్ కమీజ్ లేదా తెల్ల చీరతో ధరించాలని ఆదేశించారు.