Suraj Pusartha set up rage rooms in Madapur
mictv telugu

hydలో కొత్త కాన్సెప్ట్.. కోపంలో ఏదైనా పగులగొట్టవచ్చు

November 16, 2022

Suraj Pusartha set up rage rooms in Madapur

హైదరాబాద్ నగరంలో కొత్త కాన్సెప్ట్ మొదలైంది. మనలో కోపం వస్తే కొంత మంది మౌనంగా ఉండిపోతారు. మరికొందరు అక్కడ నుంచి వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం కోపం పట్టలేక ఆవేశంలో వస్తువులను పగులగొడతారు. అంతటితో ఆగక భౌతిక దాడులకు దిగుతారు. ఈ దెబ్బకు ఇంట్లో వస్తువులతో పాటు ఫ్యామిలీ చెంపలు పగులుతాయి. సరిగ్గా ఈ బలహీనతను పట్టుకున్న ఓ యువకుడు ‘కోపం వస్తే ఇంట్లో వస్తువులు పగులగొట్టకండి. సొంత మనుషుల చెంపలు వాయించకండి.

మా దగ్గరకి వచ్చి మీ కోపం తగ్గించుకోండి’ అని ఆఫర్ చేస్తున్నాడు. సూరజ్ పూసర్త అనే యువకుడు ఈ కొత్త కాన్సెప్ట్‌‌తో కూడిన సెంటర్‌‌ను సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్లు అధికంగా ఉండే మాదాపూర్‌‌లో స్థాపించాడు. 25 ఏళ్ల సూరజ్ ఒత్తిడి తగ్గించుకోవడానికి రేజ్ రూం ఏర్పాటు చేశాడు. మొత్తం రెండు రేజ్ రూంలు ఉండగా, ఒకేసారి ఏడుగురు వ్యక్తులు లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 20 నిమిషాలు లోపల ఉండవచ్చు. ఇందుకోసం మూడు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాడు.

క్వికీ అనే ప్యాకేజీ రేటు రూ. 1300 ఉండగా, ఏడు సీసాలు, కీబోర్డులు, స్పీకర్లు, మిగతా ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసం చేయవచ్చు. రఫ్ డే ప్యాకేజీ ధర రూ. 1500 లో 15 బాటిళ్లతో కూడిన రెండు డబ్బాలు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు పగులగొట్టొచ్చు. రేజ్ మోడ్ ప్యాకేజీ ధర రూ. 2800 లో వాషింగ్ మెషీన్, టీవీ సెట్, ఫ్రిజ్, ఓవెన్, ల్యాప్ ట్యాప్ వంటి వస్తువులను ముక్కలు చేయవచ్చు. విదేశాల్లో ఎప్పటినుంచో ఉన్న ఈ రూంలను తొలిసారి నగరానికి పరిచయం చేస్తున్నానని సూరజ్ తెలిపాడు. చిన్నప్పుడు తాను కూడా ఇలాగే ప్రవర్తించడంతో చాలా వస్తువులు పగిలిపోయాయని, తనలా ఎవరు కూడా ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయకుండా ఉండేందుకు ఈ రేజ్ రూంలను ప్రారంభించినట్టు వెల్లడించారు.