సురేష్ బొబ్బిలి డబుల్ ధమాకా.. జార్జిరెడ్డి, తోలుబొమ్మలాట రెండూ రేపే - MicTv.in - Telugu News
mictv telugu

సురేష్ బొబ్బిలి డబుల్ ధమాకా.. జార్జిరెడ్డి, తోలుబొమ్మలాట రెండూ రేపే

November 21, 2019

రేపు విడుదల అవుతున్న ‘జార్జిరెడ్డి’ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆ సినిమాలో నటించిన వారి నుంచి మొదలు ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు ఎవరెవరు అని ఆరాలు తీస్తున్నారు. విడుదలకు ముందే బొమ్మ హిట్టు అని అంటున్నారు. విప్లవ ధృవతారగా 1960-70 దశకాల్లో సంచలనం జార్జిరెడ్డి. తెలంగాణ చెగువేరాగా ఉస్మానియాలో ఆయనది చెరగని సంతకం. అంతటి వీరుడి కథను సినిమాగా తీస్తున్నారంటే.. దానికి పనిచేసేవాళ్లు కూడా వారివారి రంగాలలో నిష్ణాతులే అయిఉండాలి. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి గురించి మాట్లాడుకోవాలి. ఇందులోని ఐదు పాటలకు సురేష్ చక్కని బాణీలు సమకూర్చారు. పాటలు ఈ సినిమాకు ప్రత్యేకతను ఆపాదించాయనే చెప్పాలి. 

Suresh Bobbili.

అయితే సురేష్ బొబ్బిలి ఇప్పుడు డబుల్ ధమాకా కొడుతున్నాడు. కారణం అతను సంగీతం అందించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవడం. ఒకటి దళం జీవన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘జార్జిరెడ్డి’ కాగా, మరో సినిమా ‘తోలు బొమ్మలాట’. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ దర్శకుడు దేవీ ప్రసాద్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా సురేష్ బొబ్బిలి వినసొంపైన సంగీతం అందించారు. తాను సంగీతం అందిస్తున్న రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవడం చాలా సంతోషంగా ఉందని సురేష్ తెలిపారు. ఒకటి విప్లవాత్మక సినిమా కాగా, రెండోది కుటుంబ కథా చిత్రం అవడం విశేషం. రెండు భిన్నమైన సినిమాలకు ఏకకాలంలో సంగీతం అందిచడం కాస్త రిస్క్ అనిపించినా వాటికి పూర్తి న్యాయం చేశానని అన్నారు. డబుల్ ధమాకాను చవిచూస్తున్న సురేష్ రేపటికోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. 

కాగా, సురేష్ తొలుత బతుకమ్మ పాటలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి సినిమాల వరకు ఎదిగాడు. మా అబ్బాయి, నీదీనాదీ ఒకేకథ, నువ్వు తోపురా, తిప్పరా మీసం చిత్రాలకు సంగీతం అందించాడు. త్వరలో విడుదల అవనున్న ‘అక్షర’ చిత్రానికి కూడా సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.